ముస్తాబైన అయినవిల్లి
ముస్తాబైన అయినవిల్లి
Published Sun, Sep 4 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
నేటి నుంచి 13 వరకూ నవరాత్రి మహోత్సవాలు
అయినవిల్లి : కోరిన వరాలిచ్చే కొండంత దేవుడు కోనసీమలో కొలువుదీరిన అయినవిల్లి విఘ్నేశ్వరుడు. స్వామివారిని ఒక్కసారి దర్శిస్తే చాలు అషై్టశ్వర్యాలతో తులతూగుతారనేది భక్తుల నమ్మకం. చవితి రోజున విఘ్నేశ్వర S స్వామి వారిని దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతారు. స్వామివారికి ఈ తొమ్మిది రోజులూ విశేష పూజలు జరుపుతారు. ఈ నవరాత్రుల్లో సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారని అంచనా. దానికి తగ్గట్టు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయం వద్ద బ్యారికేడ్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన దేవతల ఆకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయ ప్రాకారానికి, గోపురాలకు రంగులు అద్దారు. చవితి ఉత్సవాల తొమ్మిది రోజులూ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా ఆలయంలో మండపాలను నిర్మించారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఆలయ కమిటీ చైర్మన్ రావిపాటి సుబ్బరాజు, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు (సతీష్‌రాజు) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వినాయక చవితినాడు స్వామివారికి సీజనల్ పండ్ల రసాలతో ప్రత్యేక అభిషేకాలు, లక్ష దుర్వార్చన, లక్ష్మీగణపతిహోమం నిర్వహిస్తారు. భక్తులందరికీ స్వామి వారి రవ్వలడ్డు, పులిహోర ప్రసాదం అందజేసేందుకు ప్రత్యేకంగా పనివారిని నియమించి తయారు చేయిస్తున్నారు. ఆలయం వద్ద తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
అయినవిల్లికి ఇలా చేరుకోవచ్చు
రాజమండ్రి నుంచి రావులపాలెం, కొత్తపేట మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. కాకినాడ నుంచి యానాం, ఎదుర్లంక బ్రిడ్జి మీదుగా అమలాపురం చేరుకుని అయినవిల్లిలో విఘ్నేశ్వరుని సన్నిధికి రావచ్చు. కాకినాడ నుంచి రామచంద్రపురం, ద్రాక్షరామ మీదుగా కోటిపల్లి రేవు దాటి అయినవిల్లి చేరుకోవచ్చు.
Advertisement
Advertisement