మీడియాతో మాట్లాడుతున్న వి.హనుమంత రావు
సాక్షి, తిరుమల:
సినీనటుడు పవన్‌కల్యాణ్ మద్దతుతోనే చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారని కాంగ్రెస్‌పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 28శాతం జనాభా ఉన్న కాపులకు అధికారం ఎందుకు రాకూడదు? అని అన్నారు. ఇప్పటికే రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని పాలించాయని, కాపులు కూడా ఎందుకు అధికార పగ్గాలు చేపట్టకూడదు? అని జనంలో ఉందన్నారు. బ్రిటీషు హయాంలో బీసీలుగా ఉండే కాపులను, ఇచ్చిన హామీ మేరకు టీటీడీ ప్రభుత్వం తిరిగి బీసీలు గుర్తించేందుకు చొరవ చూపాలని ఆయన డిమాండ్ చేశారు. 2019లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్‌పార్టీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోందని, పార్టీని వీడిన నేతలు, జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కషి చేయాలన్నారు.