-
జెండా మోసే వాళ్లపై అంత నిర్లక్ష్యమా!
-
కొత్తవారికి పెద్దపీట వేస్తారా
-
కొత్తనీరు మంచిదే... అది కలుషితమయిందైతే..?
-
‘దేశం’సమన్వయ కమిటీ సమావేశంలో కార్యకర్తల నిలదీత
సాక్షిప్రతినిధి, కాకినాడ :
పాతికేళ్లుగా పార్టీ జెండా మోస్తున్నాం ...
తీరా అధికారంలోకి వచ్చేసరికి నిన్నటి వరకు మనపై
తిరుగుబాటు చేసిన వారిని అక్కున చేర్చుకున్నారు..
పార్టీనే నమ్ముకుని ఉన్నా పట్టించుకోరా...
మా కంటే వారే గొప్పవాళ్లయ్యారా? వారినే అందలమెక్కిస్తారా...
వారికి ఇచ్చే గౌరవంలో కనీసం కొంతైనా మాకు ఇవ్వరా...
పార్టీ అధినేత ఇచ్చిన హామీల మాటేమిటని నిలదీస్తున్నారు..
బయట జనానికి ఏమని సమాధానం చెప్పాలి...
పెద్దాపురం ఆర్యవైశ్య కల్యాణమండపంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు గుక్కతిప్పుకోకుండా పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీశారు. జిల్లా ఇన్‌ఛార్జి, నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ల సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాను అనుమతించకుండా నాలుగు గోడల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధ్యక్షతన నిర్వహించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజక వర్గాల్లో పార్టీని కాదని వెళ్లిపోయి తిరిగి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావుతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనే అంశం చర్చనీయాంశమైంది.
తిరుగుబాటు తప్పదని తెలిసి...
తొలుత నియోజకవర్గాల వారీగా సమీక్షించాలనుకున్నారు. అలా అయితే నేతలు, క్యాడర్‌లో ఉన్న అసంతృప్తులను చక్కదిద్దడం సమస్యవుతుందనే భయంతో నాలుగైదు నియోజకవర్గాలు కలిపి సమీక్షించారు. కొన్ని నియోజకవర్గాల సమీక్షలో కొందరు నేతలు నేరుగా పార్టీ పెద్దల సమక్షంలోనే తాము చెప్పదలుచుకున్న విషయాలు కుండబద్దలు కొట్టగా, మరికొందరు ముఖ్యనేతలను విడిగా కలిసి కొత్తగా వచ్చిన నేతలతో ఉన్న తలపోట్లను ఏకరవుపెట్టుకున్నారని సమాచారం. ‘కొత్తనీరు రావడం మంచిదే కానీ ఆ నీరు కలుషితమైందైతేనే ప్రమాదకరం’ అని ప్రత్తిపాడు నియోజకవర్గ సమీక్షలో కొందరు నేతలు చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు వేదికపైననున్న నేతలకు ముచ్చెమటలెక్కించాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాతికేళ్లుగా పార్టీలో ఉన్న వారిని పక్కనబెట్టేసి కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సహా ఆ వర్గానికి చెందిన వారి పెత్తనంపై పార్టీ నేతలు ఒకింత అసహనం వ్యక్తం చేశారని తెలియవచ్చింది. సమావేశంలో బహిరంగంగా ఈ అంశాలు చెప్పే ధైర్యం చేయలేక కొందరు వ్యక్తిగతంగా కలిసి ముఖ్య నేతల వద్ద మొరబెట్టుకున్నారని సమాచారం.
ఇవేమి రాజకీయాలు...
ప్రత్తిపాడు సమీక్ష ప్రారంభమయ్యాక ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నియోజకవర్గంలో ఇబ్బందులున్నాయి. కొన్ని సెట్ చేశాను, మిగిలిన వాటిని త్వరలోనే సెట్‌రైట్ చేస్తానని ఉపోద్ఘాతం ఇవ్వడంతో అక్కడ ఏమి జరుగుతుందో చెబుదామని వచ్చిన నేతలు మిన్నకుండిపోయారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు రొంగలి సూర్యారావు దీపం పథకం సహా పలు పథకాలు సక్రమంగా అమలుకావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడుకు చెందిన కొందరు నేతలు రెండు మండలాలు ఒకరు, రెండు మండలాలు మరొకరు పంచేసుకుని రాజకీయాలు చేస్తూ పార్టీలో మొదటి నుంచీ ఉన్న వారిని పక్కన పెట్టేస్తున్నారని పలువురు ప్రైవేటుగా ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగ్గంపేట నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే అంశం కూడా కొలిక్కి రాలేదు. ఇటీవలనే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలువురు పేర్లతో సమన్వయ∙కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించగా ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జ్యోతుల చంటిబాబు తీవ్రంగా విభేదించారని తెలియవచ్చింది. గత ఎన్నికల్లో అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న చంటిబాబుకు నెహ్రూ టీడీపీలోకి రావడాన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడలేకపోతున్న క్రమంలోనే పార్టీ సమావేశంలో సమన్వయ కమిటీ ఏర్పాటులో వీరిద్దరి మధ్య అంతర్గతంగా నెలకొన్న వైషమ్యాలు బయటపడ్డాయని సమావేశం నుంచి బయటకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకోవడం వినిపించింది. నెహ్రూ ప్రతిపాదనను వ్యతిరేకించిన చంటిబాబు తనతోపాటు కాకినాడ ఎంపీ, ఎమ్మెల్యే అందరి సమక్షంలోనే సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని గట్టిగా పట్టుబట్టి అందుకు పార్టీ పెద్దలు కూడా అంగీకరించేలా కార్యకర్తలు విజయం సాధించారు.
ఉపాధి లేదాయే ...
రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొత్తపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా నేతలు బాబు వస్తే జాబ్ అనిచెప్పాం, ఇప్పుడు జాబ్ లేదు..కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వలేదు. పట్టణాల్లో అందరికీ ఇళ్ళు పథకమని ప్రకటనలు చేసి ఇప్పుడు కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేని పరిస్థితిలో ఉంటే జనంలోకి ఎలా వెళ్లమంటామరని సమన్వయ కమిటీ సభ్యులు ప్రశ్నించడంతో వేదికపై ఉన్న మంత్రులు దేవినేని, రాజప్ప విస్తుపోయి అంతా సర్థుబాటవుతుందని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీపం పథకం, రేషన్ సరఫరా, పలు సంక్షేమ పథకాల్లో విఫలమవుతున్నామని నిలదీశారు. దీనిపై మంత్రి దేవినేని ‘అన్నీ సర్దుకుంటాయని’ సమాధానిమివ్వగా మరో నియోజకవర్గానికి చెందిన సమన్వయ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ రేషన్‌కు బెస్ట్ ఫింగర్ పేరుతో కుటుంబ సభ్యులందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ప్రభుత్వ కార్యక్రమాలు వల్లెవేస్తుండగా పలువురు కార్యకర్తలు అడ్డుతగిలారని తెలిసింది. హౌస్ పర్ ఆల్ ఏమైందని, గృహ నిర్మాణంలో ఒకటైనా ఇళ్లు ఇచ్చామా, ఎన్నికల్లో బాబు వస్తే జాబు ఇస్తామన్నాం, నిరుద్యోగ బృతి ఇస్తామన్నాం, వీటిలో ఇప్పుడు ఏమిచ్చారని ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకున్నామని నేతలు మంత్రుల సాక్షిగానేచంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడాన్ని నిగ్గతీసినట్టు తెలిసింది. లోటు బడ్జెట్‌లో ఉన్నాం, నిధులు లేక ప్రభుత్వం నడపడటం చాలా కష్టంగా ఉంది, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయండని ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి దేవినేని ముక్తాయించి సమావేశాన్ని ముగించారు.