schemes implimentations
-
అప్పులున్నా ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
ఎర్రుపాలెం: ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణను ధనిక రాష్ట్రంగా సోనియా గాంధీ అప్పగిస్తే గత పాలకులు రూ.లక్షల కోట్ల అప్పులు మిగి ల్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. అయినప్పటికీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ప్రజల కోసం పార్టీలకతీతంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపా డులో శనివారం జరిగిన ప్రజాపాలన సభలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన రోజునే మహిళలకు ఉచిత బస్సుప్ర యాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం ద్వారా రెండు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. అయితే, కొందరు ఆరు గ్యారంటీలు అమలు కాకుంటే బాగుండాలని కోరుకుంటున్నా.. వారి కోరిక నెరవేరదని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి భట్టి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలిస్తే కరెంట్ ఉండదని చెబుతూ, కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని బీఆర్ఎస్ అడిగితే ప్రజలు మాత్రం కరెంట్‌తో పాటు కాంగ్రెస్ కూడా కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ఎన్ని కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని తెలిపారు. పదేళ్లు పాలించిన వారు నెల కాక ముందే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకులు ఎన్ని అప్పులు చేశారు, రాష్ట్రాన్ని ఎలా తాకట్టు పెట్టారో చెప్పేందుకే శ్వేత పత్రాలను విడుదల చేశామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వం ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతా లు ఇవ్వలేదని, తాము 5వ తేదీలోపు ఇచ్చామని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని భట్టి వెల్లడించారు. విద్యుత్ రంగంపై రూ.లక్ష కోట్లు అప్పుల భారం ఉన్నా 24 గంటల కరెంట్ ఇస్తామని, ప్రతీ మండలంలో అత్యున్నతస్థాయి పాఠశాలలు ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశారు. అనంతరం మామునూరులోని తాగునీటి ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లో కలెక్టర్ గౌతమ్, సీపీ సునీల్‌దత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో సుపరిపాలన
సాక్షి, పాత గుంటూరు: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఒకటో డివిజన్ తారకరామనగర్‌లోని 3వ సచివాలయ పరిధిలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. పింఛన్ ఒకటో తేదీనే అందుతుందా? అని వృద్ధుల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల్ని తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాలనీలోని పలు వీధుల్లో ప్రజలు మురుగు సమస్య ఉందని చెప్పడంతో వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పలువురు వృద్ధులు పింఛన్ రాలేదని తెలపడంతో వెంటనే మంజూరు దిశగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో పథకాల అమలులో వివక్ష చూపారని, ప్రస్తుత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. ఇంటి వద్దకే పథకాలు వచ్చే విధంగా సీఎం జగన్ వలంటీర్, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలువుతున్న తీరుపై రూపొందించిన కరపత్రాల్ని ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీల, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ షేక్ ముంతాజ్ బేగం, ఒకటో డివిజన్ కార్పొరేటర్ కామిరెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు యాట్ల రవి, అంబేడ్కర్, దూపాటి వంశీబాబు, ఆబిద్ బాష, షేక్ మీరావలి, వైఎస్పార్ సీపీ నాయకులు కేసరి సుబ్బులు, రాచమంటి భాస్కర్, పోలవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు) -
దిశ చట్టం విప్లవాత్మక పరిణామం: సీఎం జగన్
అమరావతి: సమష్టి కృషితోనే విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో దిశ చట్టం ఒక విప్లవాత్మక పరిణామమని పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో వ్యయ నియంత్రణపై మనం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. మన విధానాలు మిగిలిన రాష్ట్రాలను ఆకర్షించాయని పేర్కొన్నారు. ఉగాది రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు సత్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇద్దామని అధికారులకు చెప్పారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం చేపట్టిన టెండర్ల జ్యూడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం మన ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం, భూముల సమగ్ర రీసర్వేను ఈ 20 నెలల్లోనే చేపట్టగలిగామని వివరించారు. ఉగాది రోజు వారిని సత్కరించాలి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్’ చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలని అధికారులకు ఆదేశించారు. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలని చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, కొందరు జీతాల పెంపు కోసం రోడ్డెక్కడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థలను మెరుగైన సేవలందించడం కోసమే ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధమని స్పష్టం చేశారు. ఉగాది రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో వారికి సత్కారం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇద్దామని అధికారులకు చెప్పారు. వాలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలని వివరించారు. -
చంద్రబాబు కాపీలు కొట్టడంలో నంబర్ వన్
-
అన్నీ ఉత్తుత్తి మాటలే..!
స్వయానా ముఖ్యమంత్రి, ప్రముఖులు కొలువుదీరిన వేదికపై నుంచి ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చవని ఎవరైనా అనుకుంటారా... అందునా దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి.. అమరావతి కేంద్రంగా పాలన సాగించే వ్యక్తి ఇచ్చిన హామీలు చిటికెలో కార్యాచరణకు నోచుకోవాలి. ఆయన హామీలంటే శాసనం కింద లెక్క. కానీ తాడేపల్లిగూడెం విషయంలో స్వయానా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు 37 నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. తాడేపల్లిగూడెం: సరిగ్గా 37 నెలల క్రితం.. కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, రాష్ట్ర మంత్రులు కొలువుదీరిన నిట్ భవనాల శంకుస్థాపన కార్యక్రమం 2015 ఆగస్టు 20న జరిగింది. శంకుస్థాపన తంతు ముగిశాక గూడెం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అక్షరాలా 21 హామీలను అధికారికంగా ప్రకటించారు. వాటిలో ఒకటిరెండు తప్ప మిగతావన్నీ అమలు కాలేదు. ఇదీ హామీల చిట్టా.. తాడేపల్లిగూడెంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టేట్ కాదుకదా ఒక్క పరిశ్రమ ఆనవాలు కూడా ఇప్పటి వరకు లేదు. విమానాశ్రయ భూముల్లో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. భూములకు అడ్వాన్సు పొజిషన్‌ను 2017 సెప్టెంబరు 18వ తేదీన ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పనులకు ఒక్క ఇటుక కూడా పడలేదు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు ఇస్తామన్నారు. పని ప్రగతిలో ఉందని చెబుతున్నారు. ఒక్క రోడ్డు తవ్వి హౌస్చాంబర్ కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు పైపులైను ద్వారా గోదావరి జలాలను తీసుకు వస్తానన్నారు. దీని కోసం మునిసిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే తీర్మానం చేసింది. పనికి నాలుగేళ్లు వచ్చినా అతీగతీ లేదు. అధునాతన జంతు కబేళా ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్న కబేళాను తొలగించారు. కొత్త కబేళా నిర్మించలేదు. రోడ్డు పక్కనే రహస్యంగా జీవాలను కోస్తున్నారు. పట్ణణంలో డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. డ్రెయిన్లు కొన్ని నిర్మించారు. కనెక్షనులు ఇవ్వలేదు. గూడెం మునిసిపాలిటీ పరిధిలో చెరువుల రక్షణ, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పని పూర్తికాలేదు. పురపాలక సంఘానికి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దానికి నిధులు మంజూరు చేయలేదు. మునిసిపాలిటీ పరిధిలో శ్మశానాల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు. ఇంకా పరిపాలనా పరమైన ఆమోదం రాలేదు. వర్షపునీటి సమగ్ర డ్రెయినేజీ పథకంపై ప్రకటన చేసినా ఈ పని ఎక్కడుందో తెలియని పరిస్థితి. పట్టణంలో మెరుగైన మంచినీటి సరఫరా, 37 నెలలు గడిచాక టెండర్ల స్థాయికి వచ్చింది. గూడెం పట్టణ సుందరీకరణ పనులు ప్రస్తుతం ప్రగతిలోకి వచ్చాయి. ఎడ్యుకేషన్ హబ్‌గా గూడెంను చేస్తామని సీఎం ప్రకటిం చారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర కళాశాలలకు భవనాలు నిర్మిస్తామన్నారు. ఇవి కార్యరూపం దాల్చలేదు. పట్ణణంలో రహదారుల నిర్మాణం హామీలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ప్రగతిలోకి రాలేదు. ప్రభుత్వ పాఠశాలల చుట్టూ ప్రహరీల నిర్మాణం పట్టాలెక్కలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సౌకర్యాల కల్పన ఫైల్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. 5,376 మంది లబ్ధిదారులు ఉంటే మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణాలలో ఇప్పటికి 1,400 ఇళ్లు మాత్రమే తయారయ్యాయి. అవి కూడా పేదలకు ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. మరో 25 హామీలు గూడెం అభివృద్ధికి మరో 25 హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన సెంట్రల్ ఐటీఐను గూడెంకు కేటాయించారు. ప్రక్రియ ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఈ దిశగా అడుగులు పడలేదు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం ఊసేలేదు. విమానాశ్రయ నిర్మాణం ఏర్పాటు తలంపే లేదు. నిట్ గోడ నిర్మించడానికే రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల వ్యవధి తీసుకుంది. స్వయానా సీఎం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు అసహనంతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం మౌనపోరాట దీక్ష చేశారు. సీఎం అనుకూలంగా ఉన్నా.. ఇక్కడ కొందరు సైంధవులు, శిఖండులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీఎం నేరుగా ఇచ్చిన హామీల పరిష్కారానికి శనివారం ధర్మపోరాటదీక్ష వేదికపై నుంచి ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. -
ప్రతీ పైసా లబ్ధిదారుడికే
తాల్చేర్/ఝార్సుగూడ/జాంజగీర్–చంపా: కాంగ్రెస్ హయాంలో పథకాల అమల్లో అవినీతి చోటుచేసుకుందని, ఇప్పుడు ప్రతీ పైసా పేదలకు అందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కారు నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దాదాపుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ లక్ష్యంతో ముందుకు.. ‘నక్సలైట్లు, పేలుళ్లు, రక్తపాతానికి పేరుపడ్డ ఛత్తీస్‌గఢ్.. బీజేపీ హయాంలో అన్ని సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి పథంలో నడుస్తున్న రాష్ట్రాల నడుమ స్థానాన్ని సంపాదించుకుంది’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రాలకు అందే నిధులు సక్రమంగా ఖర్చయ్యేవి కాదని, ఇప్పుడు ప్రతీ పైసా లబ్ధిదారుడికి చేరుతోందని అన్నారు. ‘ఎన్నికల్లో గెలుపు కోసమో లేదా ఓటు బ్యాంకు కోసమో పథకాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఓటు బ్యాంకు కోసం కాకుండా అందరి లబ్ధికే మా ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ. 1607 కోట్లతో నిర్మించనున్న బిలాస్పూర్–పత్రపాలి రహదారికి, రూ. 1,697 కోట్లతో బిలాస్పూర్–అనుప్పుర్ మూడో రైల్వే లైన్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి ఒడిశాలోని తాల్చేర్‌లో రూ.13 వేల కోట్ల ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘ఆయుష్మాన్ భారత్‌తో ఒడిశా ప్రజల్ని అనుసంధానం చేయాలని సీఎం నవీన్ పట్నాయక్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద ప్రజలు పథకం లబ్ధిని కోల్పోతారు’ అని ఆందోళన వెలిబుచ్చారు. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న బిజూ స్వాస్థ్య కల్యాణ్ యోజన పథకమే మెరుగైనదిగా పేర్కొంటూ ఆయుష్మాన్ భారత్‌లో ఒడిశా చేరలేదు. వచ్చే ఏడాది ఒడిశాలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో పర్సంటేజ్, కమిషన్ల రాజ్యమేలుతున్నాయని ఆయన విమర్శించారు. ఝార్సుగూడలో వీర్ సురేంద్ర సాయ్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. డబ్బులివ్వకపోతే మరుగుదొడ్ల నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ప్రజలకే చేరడం లేదని విమర్శించారు. తాల్చేర్ ఎరువుల కర్మాగారంలో బొగ్గు నుంచి ఉత్పత్తి చేసిన గ్యాస్ ద్వారా వేపపూతతో కూడిన యూరియాను తయారుచేస్తారు. మోదీకి అరటి శాలువా జాంజగీర్ సభలో ప్రధాని మోదీకి స్వయం సహాయక గ్రూపులకు చెందిన మహిళలు అరటి, అవిసె చెట్ల ఉత్పత్తుల నుంచి తయారు చేసిన జాకెట్, శాలువాను బహూకరించారు. ఆ జాకెట్ ధరించే సభలో మోదీ ప్రసంగించారు. -
అరుదైన దార్శనికుడు
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 69వ జయంతి ఈ రోజు. రాజకీయవాదులలో, అధికారులలో, జర్నలిస్టులలో, సాధారణ ప్రజలలో అనేకమందికి వైఎస్‌తో ఎవరి అను భవం వారికి ఉన్నది. ఒక్కసారి కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు భావిస్తాడు. అది వైఎస్ వ్యక్తిత్వంలోని విశిష్టత. చిరుమందహాసం, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడే మనస్తత్వం, నమ్ముకున్నవారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, మతాలకూ, కులాలకూ అతీతంగా వ్యవ హరించే లౌకిక స్వభావం, నేలవిడిచి సాము చేయని ఆచర ణవాదం, ప్రేమనూ, ఆప్యాయతనూ పంచిపెట్టే ధోరణి వైఎస్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టిన లక్షణాలు. ఈ లక్ష ణాలలో కొన్ని కానీ, అన్నీ కానీ అనుభవంలోకి వచ్చినవారు ఎందరో ఉంటారు. వారంతా వైఎస్ జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. ‘ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎట్లా బతికామన్నది ప్రధానం’ అని అనేవారు వైఎస్. ఆయన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసినవారు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వైఎస్ అంత వేగంగా, ముమ్మరంగా, ఏకాగ్రచిత్తంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేసినవారు లేరు. ఒకే ఒక్క పదవీకాలం (5 ఏళ్ళు)లో వైద్యం, విద్య, అభివృద్ధి, సంక్షేమరంగాలలో అనేక కార్యక్రమాలు రూపొందించి, అమలు చేసిన ముఖ్య మంత్రి మరొకరు కనిపించరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పరిపాలనాదక్షులుగా పేరు తెచ్చుకు న్నారు. కానీ ప్రజల సంక్షేమానికి వైఎస్ ఇచ్చినంత ప్రాధా న్యం వారు ఇవ్వలేదు. వైఎస్‌లో నాయకత్వ లక్షణాలు జన్మతః వచ్చినవి. గుల్బర్గాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న రోజు ల్లోనే విద్యార్థి నాయకుడుగా పేరు. కాంగ్రెస్‌లో స్వయంప్ర కాశం గల నాయకుడిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రత్య ర్థిగా పాతికేళ్లపాటు మనగలగడం సామాన్యమైన విషయం కాదు. 1978 నుంచి 2009 వరకూ 31 ఏళ్ల పాటు అన్ని ఎన్ని కలలోనూ విజయం సాధించిన నాయకుడు. కాంగ్రెస్‌లో నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే సాటి నాయకులతో పోటీ పడటమే కాకుండా అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అసమ్మతి నాయకులను కాచుకోవాలి. తన ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడానికి ప్రయత్నించే సొంత పార్టీ ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలబడటానికి ఎంతో గుండెధైర్యం కావాలి. చాడీలు చెప్పేవారికి చెవి ఒగ్గే అధిష్ఠానం ఎప్పుడు ఆగ్రహిస్తుందో, ఎప్పుడు అనుగ్రహి స్తుందో తెలియని వాతావరణంలో మంచి రోజులకోసం, అనుకూల వాతావరణం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడ టానికి ఎంతో ఓర్పూ, నేర్పూ అవసరం. ‘తెలుగుదేశం’ లాగానే ప్రాంతీయపార్టీ పెట్టాలని కొందరు సన్నిహితులు సలహా చెప్పినా కాంగ్రెస్‌ని వీడటానికి వైఎస్ అంగీకరించ లేదు. ముప్పయ్ అయిదేళ్ళకే పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే పార్టీలో ప్రత్యర్థులు ఈర్ష్యపడ్డారు. చిన్నతనంలోనే ముఖ్య మంత్రి అయిపోతారేమోనని కంగారు పడ్డారు. చొక్కారావు, ద్రోణంరాజు సత్యనారాయణ వంటి సీనియర్లు వైఎస్‌కు అండగా ఉండేవారు. పీవీ, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారు ఆయనను ఆణచివేయడానికి ప్రయత్నం చేశారు. 2003లో పాదయాత్ర చేసినప్పుడు కూడా పార్టీలో ప్రత్య ర్థులు ఆయనతో సహకరించలేదు. ఉడుక్కున్నారు. మండు టెండను లెక్కపెట్టకుండా నడుచుకుంటూ వచ్చి తమ యోగ క్షేమాలను విచారిస్తున్న వైఎస్‌ను ప్రజలు ఆదరించారు. పశ్చిమగోదావరి నుంచి రైల్–రోడ్డు బ్రిడ్జి దాటి తూర్పు గోదావరిలో ప్రవేశించే సరికి వైఎస్‌కి అనుకూలంగా ప్రభం జనం ఆరంభమైంది. పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా మార్చి వేసింది. పేదరికాన్నీ, పేద ప్రజల కష్టాలనూ స్వయంగా చూసి తెలుసుకున్నారు. పగలకూ, పంతాలకూ స్వస్తి చెప్పి ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేసి తరించాలని తీర్మా నించుకున్నారు. తన కోపం నరం తెగిపోయిందంటూ చెప్పే వారు. 2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. ఎన్నో సంవత్సరాలు ఎంతో ఓపికతో వేచి చూసిన అవకాశం వచ్చిన వెంటనే విజృంభించి ఆరేళ్ళ కంటే తక్కువ వ్యవ ధిలో ఇరవై ఏళ్లలో చేయగలిగిన మేలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరో తరుముతున్నట్టు పథకాలు ప్రక టించి అమలు చేశారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒక విధమైన లబ్ధి చేకూ రింది. అయిదుగురు మహిళలకు కేబినెట్లో స్థానం కల్పిం చడమే కాకుండా మంచిశాఖలు అప్పగించారు. వారు కూడా సమర్థంగా నిర్వహించారు. మహిళలు మనసు పెట్టి పని చేస్తారనీ, వారిలో నిర్వహణ సామర్థ్యం ఉంటుందనీ ఆయన నమ్మకం. రాజకీయంగా ఎంత చతురతతో వ్యవహరిం చారో పరిపాలనా ర థాన్ని అంతే వేగంగా నడిపించారు. నాయకత్వ లక్షణాలు నిజమైన ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలేమిటి? ‘మీకు అండగా నేనున్నాను’ అన్న భరోసా ప్రజలకివ్వడం. సహచరులూ, అనుచరులూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేనికీ వెనకాడకుండా లేకుండా ఆదుకోవడం. వాగ్దానాలను అమ లుచేయడానికి మనస్పూర్తిగా, నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేయడం. ప్రజల ప్రగతి పట్ల, వారి అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. దృఢమైన నిర్ణ యాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం. ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడటం. సంక్షేమ, ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని సాధించడంలో క్షేత్రవాస్తవికతను దృష్టిలో పెట్టుకొని, సాహ సోపేతమైన, సృజనాత్మకమైన కార్యక్రమాలు రూపొందిం చుకొని భవిష్యత్ చిత్రపటాన్ని నిర్ణయించుకోవడం. దూర దృష్టితో అభివృద్ధికి ప్రణాళికా రచన చేసిన రాజకీయవాదే రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కొత్తబాటలో మేలు చేయాలని ప్రయత్నించిన నాయకులను చరిత్రకా రులు నిశ్చయంగా గుర్తిస్తారు. వైఎస్ ప్రభావం ఆయన కుటుంబం మొత్తంపైన ఉన్నది. ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులలో ముగ్గురు (ఆయనా, కుమార్తె షర్మిల, కుమారుడు జగన్మోహన్రెడ్డి) వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం, ప్రజలతో మమేకం కావడం ప్రపంచం లోనే అపూర్వమైన విషయం. దళితులకూ, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయడానికి ఇందిరాగాంధీ, ఎన్టిఆర్, పీవీ చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరూ కాదనలేరు. దళితులలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేయడానికి ఇందిరాగాంధీ చేసిన చట్టాలూ, చేపట్టిన కార్యక్రమాలూ చరిత్రాత్మకమైనవి. వెను కబడిన కులాలకు ఎన్‌టి రామారావు విశేషంగా రాజకీ యంగా గుర్తింపు ఇచ్చారు. భూసంస్కరణల అమలుకూ, 1972 ఎన్నికలలో బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్ టిక్కెట్లు కేటాయించేందుకూ, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసేందుకూ పీవీ ప్రదర్శించిన తెగువను వర్తమాన రాజకీ యవాదులు పరిగణనలోకి తీసుకోకపోవచ్చును. కానీ చరిత్ర ఎప్పటికైనా నమోదు చేస్తుంది. అలాగే ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ఒకే ఒక రాష్ట్రప్రభుత్వంగా వైఎస్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిలుస్తుంది. సాచ్యురేషన్ విధానం అందరికీ వైద్య హామీ ఇచ్చే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’, విద్యా వకాశాలు కల్పించేందుకు ఫీజు చెల్లింపు పథకం (ఫీజు రీయింబర్స్మెంట్), పేదలకూ, దళితులకూ భూపంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకూ, ప్రాంతాలకూ, కులా లకూ, మతాలకూ అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ది. ఎవరికి సంక్షేమ పథకం వర్తింపజేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మా ర్గపు వ్యవస్థ వైఎస్ హయాంలో లేదు. అన్ని సంక్షేమపథకాల అమలులో ‘సాచ్యురేషన్’ (అవసరం ఉన్న అందరికీ నూటికి నూరుపాళ్ళూ అనుభవంలోకి రావాలి) అనేది వైఎస్ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ దేశానికి వ్యవసాయం వెన్నెముక అనే స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధా నమని గుర్తించి జలయజ్ఞం ఆరంభించారు. పదవీ కాలాన్ని మృత్యువు కాటేసిన కారణంగా వైఎస్ తలపెట్టిన పెద్ద ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఈ రంగంలో ఏ ప్రభుత్వం ఏమి చేసినా వైఎస్ స్వప్నం కొనసాగింపే. ఆంధ్రప్రదేశ్‌లో పోల వరం బహుళార్థసాధక ప్రాజెక్టు అయినా, తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా వైఎస్ సంకల్పిం చిన జలయజ్ఞంలో భాగమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రీఇంజనీరింగ్ ద్వారా ప్రాజెక్టు పరిణామాన్నీ, విస్తృతినీ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఊపిరాడక చాలా కాలం అచేతనంగా ఉంది. ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి. వైఎస్ అకాల మరణం చెందకుండా ఉంటే 2014 నాటికే జలయజ్ఞంలో సింహభాగం పూర్తి అయ్యేది. వైఎస్ మొట్టమొదట ముఖ్య మంత్రిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే సంతకం చేసిన ఫైలు ఉచిత విద్యుత్ రైతులకు సంబంధించింది కావడం విశేషం. అలాగే రైతు రుణమాఫీ అమలుచేశారు. ఆహారధా న్యాలకు కేంద్రం నిర్ణయించిన సబ్సిడీకి మరికొంత జోడిం చారు. దళితులకు సబ్‌ప్లాన్ ఉండాలనే ప్రతిపాదనను మన స్ఫూర్తిగా ప్రోత్సహించారు. నేను సంపాదకుడిగా ఉండగా ‘వార్త’ లో 2001లో మల్లెపల్లి లక్ష్మయ్య సబ్‌ప్లాన్‌పై రాసిన వ్యాసాన్ని ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభలో పూర్తిగా చదివి వినిపించారు. బిట్స్ పిలానీ, ఐఐటీ వంటి ప్రతి ష్ఠాత్మకమైన విద్యా సంస్థలను తీసుకురావడంలో వైఎస్ పాత్ర అద్వితీయమైనది. వైఎస్ హయాంలో వర్షాలు దండిగా కురిసేవి. సమాచార సాంకేతిక (ఐటీ) రంగం వృద్ధితో ఆర్థిక వ్యవస్థ బలపడింది. కాంగ్రెస్‌కు తీరని లోటు వైఎస్ అస్తమయం తెలుగువారి రాజకీయాలలో పెనుమా ర్పులు సృష్టించింది. వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలహీనమై ఉండేదని ఇప్పటికీ కొందరు వాదిస్తారు. అక్కడ కూడా అభివృద్ధికి బాటలు వేస్తే ప్రత్యేకవాదం బలహీనపడుతుందని ఆయన భావించేవారు. రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రగతి పథ కాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాలని ప్రయ త్నించారు. వైఎస్ సజీవంగా ఉంటే కాంగ్రెస్ ఇంతటి దీనా వస్థలో ఉండేది కాదు. ముగ్గురు మిత్రులు–వైఎస్, రాజేశ్ పైలెట్, మాధవరావ్ సింధియా– ఈ రోజున మన మధ్య ఉంటే కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని దుస్థితి దాపురించేది కాదు. దురదృష్టవశాత్తు ముగ్గురూ ప్రమాదా లలో మృతి చెందారు. 2000 జూన్ 11న దౌసా నుంచి జైపూ ర్కు వస్తూ తాను నడుపుతున్న జీపు ఆర్టీసీ బస్సును ఢీకొ నడంతో పైలట్ మరణించారు. 2001 సెప్టెంబర్ 30న కాన్పూర్ వెడుతున్న ప్రత్యేక విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి దగ్గర కూలి సింధియా దుర్మరణం పాలైనారు. 2009 సెప్టెంబర్ రెండున హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. ముగ్గురూ జనబలం ఉన్న నేతలే. సోని యాకు అండదండలు సమకూర్చగల చేవ ఉన్న నాయకులే. అటువంటి శక్తిమంతులు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. దేశం అంతటా వెతికితే వారితో ఎంతోకొంత పోల్చదగిన నాయ కుడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్ ఒక్కరే కనిపిస్తారు. కాంగ్రెస్ అధిష్ఠానం అభీష్టానికి భిన్నంగా 2009 నాటి ఎన్నికలలో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి 33 మంది లోక్‌సభ సభ్యులను గెలిపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన వాదనలో నిజంగానే పస ఉన్నట్టు నిరూపించారు. సమాజం, పేద ప్రజలు, రైతులు, గ్రామ సీమలు, రచ్చబండ గురించి మనసు పెట్టి ఆలోచించే పాత తరానికి చెందిన కాంగ్రెస్ నాయకుల పరంపరలో వైఎస్ చిట్టచివరి నేత. అటువంటి దార్శనికుడూ, జనరంజకుడూ, సమర్థుడెన రాజకీయ నాయకుడూ, పరిపాలనాదక్షుడూ, సిసలైన ప్రజానాయకుడూ చరిత్రలో అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు. కె. రామచంద్రమూర్తి -
సాక్షరభారత్ వ్యవస్థకు మంగళం
నేరడిగొండ(బోథ్): సాక్షర భారత్ వ్యవస్థకు మంగళం పాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పథకం మార్పుకు సంబంధించిన ఉత్తర్వుల జారీపై వయోజన విద్య సంచాలకులకు సంకేతాలు కూడా అందినట్లు తెలుస్తోంది. 2009లో అప్పటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులుగా ఉన్న వయోజనులు అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా సాక్షరభారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో సాక్షర భారత్ సెంటర్లను ప్రారంభించి, ఫర్నిచర్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, న్యూస్ పేపర్లు వంటి సదుపాయాలు కల్పించింది. ప్రతి గ్రామ పంచాయతీలో ఇద్దరు చొప్పున చదువుకున్న స్థానికులైన నిరుద్యోగులను గ్రామ కోఆర్డినేటర్లుగా, మండల కోఆర్డినేటర్‌గా నియమించింది. వారు ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం 5గంటల నుంచి 9గంటల వరకు వయోజనులను అక్షరాస్యులుగా తయారు చేయడానికి విధులు నిర్వర్తించారు. ఇప్పటికే వారికి రెండేళ్లుగా వేతనాలు ఇవ్వక, విధులు కల్పించకపోవడంతో కోఆర్డినేటర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ఆందోళనలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కోఆర్డినేటర్ల కొనసాగింపుపై ఎలాంటి హామీ రాలేదు. ఈ క్రమంలో సాక్షరభారత్ స్థానంలో ‘పడ్నా.. లిఖ్నా అభియాన్’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహణ.. త్వరలో ప్రారంభించనున్న కొత్త పథకాన్ని 2020 మార్చి వరకు కొనసాగించే విధంగా త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. కొత్తగా అమలు చేయనున్న పడ్నా.. లిఖ్నా అభియాన్ పథకంలో భాగంగా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బాధ్యతలను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఉన్నత పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అప్పగించనున్నట్లు సమాచారం. కోఆర్డినేటర్ల ఆందోళన.. వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నియమించిన సాక్షరభారత్ కోఆర్డినేటర్ల భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. అందులో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 866 గ్రామపంచాయతీల్లో ఇద్దరు చొప్పున 1732 మంది కోఆర్డినేటర్లు, 52 మండలాలకు ఒక్కొక్కరు చొప్పున 52 మంది కోఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ప్రతినెల గౌరవ వేతనంగా గ్రామ కోఆర్డినేటర్లకు రూ.2వేలు, మండల కోఆర్డినేటర్లకు రూ.6వేల గౌరవ వేతనం చెల్లించారు. నాలుగు, ఐదు నెలలకు ఒక్కసారి వచ్చిన వేతనాలతో తమ కుటుంబాలను పోషించుకున్న తమను తొలగిస్తే పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో కోఆర్డినేటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తమకు ఏ రంగంలోనైనా ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి కల్పించాలని ఆయా గ్రామాలు, మండలాల కోఆర్డినేటర్లు కోరుతున్నారు. ఆశించిన ఫలితం రాకపోవడం వల్లనే.. సాక్షర భారత్ పథకం ప్రారంభంలో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ రాను రాను డీలా పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సంబంధిత ఉన్నతస్థాయి అధికారులు పర్యవేక్షించకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కోఆర్డినేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోపాటు కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా ప్రయోజనం ఉండడం లేదని కేంద్రం గ్రహించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గత నెల రోజుల క్రితమే సాక్షరభారత్ సేవలను నిలిపివేసినట్లు తెలిసింది. -
సంక్షేమానికి మత్స్య అభివృద్ధి పథకం
ఖమ్మంవ్యవసాయం : మత్స్యరంగ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల సమాఖ్య ద్వారా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా మత్స్య శాఖ అభివృద్ధి అధికారి ఎన్.హన్మంతరావు తెలిపారు. నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో జిల్లాలోని మత్స్య సహకార సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై అవగాహన కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి ప్రభు త్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాకు రూ.30కోట్ల మేర కు నిధులు కేటాయించే అవకాశం ఉందన్నా రు. ఆ నిధులను ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు, మహిళా మత్స్య సహకార సంఘాలకు, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలకు, ఆయా సంఘాల సభ్యుల ప్రయోజనానికి ఖర్చు చేయనున్నట్లు తెలిపా రు. చేప పిల్లల ఉత్పత్తిని పెంచటం, చేపల వేటకు పరికరాలు అందించటం, మార్కెటింగ్, ప్రాసెసింగ్‌కు సహాయం అందించటం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ పథకాన్ని వినియోగిస్తామని తెలిపారు. వ్యక్తిగత లబ్ధిదారులకు చేపల అమ్మకానికి ద్విచక్ర వాహనం, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, వలలు, క్రాప్టు లు, లగేజీ ఆటోతో చేపల అమ్మకం, సంచార చేపల అమ్మకం వాహనం, కొత్త చేపల చెరువుల నిర్మాణం, రీ సర్క్యులేటరీ ఆక్వా కల్చర్ యూనిట్, అలంకరణ చేపల యూనిట్, విత్తన చేపలపెంపకం చెరువులకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు. వీటికి ప్రభుత్వం 75నుంచి 90 శాతం వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు. లబ్ధిదారులు రూ.4వేల నుంచి రూ.25లక్షల వరకు కూడా రుణాలు పొందవచ్చని తెలిపారు. గ్రూపులకు రూ.4లక్షల నుంచి రూ.76లక్షల వరకు సబ్సిడీపై పరికరాలు, రుణాలు ఇస్తున్న ట్లు తెలిపారు. సహకార సంఘాల స్థాయిలో, జిల్లా సంఘం స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సబ్సిడీపై రుణాలు, పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన మత్స్యకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు యడవల్లి చంద్రయ్య, నీలాల గోపి, ఖమ్మం, వైరా మత్స్య అభివృద్ధి అధికారులు వరదారెడ్డి, శివప్రసాద్, మత్స్యకారులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల పథకాల అమలుకు కృషి
ఎదులాపురం : దివ్యాంగుల పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని స్మాట్‌స్కూల్ ఆవరణలో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దివ్యాంగుల సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలుకు కృషి చేస్తుందని వివరించారు. సభాధ్యక్షులు లింగాల రాజ సమ్మయ్య మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 అమలు చేయడంలో ప్రభుత్వం చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నారాయణ, జానీ, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బావునే నగేశ్, ఆకుల సునిల్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ సుకుమార్, సంఘ బాధ్యులు సురేశ్, ప్రమోద్ కుమార్, ఎండీ ఇమ్రాన్, సూర్య, మహిళా విభాగం, మధుకర్, రవీందర్, నానయ్య, సలీం, అమానుల్లఖాన్, శ్రీధర్, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
బాబు వస్తే..జాబు ఏమైంది..
జెండా మోసే వాళ్లపై అంత నిర్లక్ష్యమా! కొత్తవారికి పెద్దపీట వేస్తారా కొత్తనీరు మంచిదే... అది కలుషితమయిందైతే..? ‘దేశం’సమన్వయ కమిటీ సమావేశంలో కార్యకర్తల నిలదీత సాక్షిప్రతినిధి, కాకినాడ : పాతికేళ్లుగా పార్టీ జెండా మోస్తున్నాం ... తీరా అధికారంలోకి వచ్చేసరికి నిన్నటి వరకు మనపై తిరుగుబాటు చేసిన వారిని అక్కున చేర్చుకున్నారు.. పార్టీనే నమ్ముకుని ఉన్నా పట్టించుకోరా... మా కంటే వారే గొప్పవాళ్లయ్యారా? వారినే అందలమెక్కిస్తారా... వారికి ఇచ్చే గౌరవంలో కనీసం కొంతైనా మాకు ఇవ్వరా... పార్టీ అధినేత ఇచ్చిన హామీల మాటేమిటని నిలదీస్తున్నారు.. బయట జనానికి ఏమని సమాధానం చెప్పాలి... పెద్దాపురం ఆర్యవైశ్య కల్యాణమండపంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు గుక్కతిప్పుకోకుండా పార్టీ నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీశారు. జిల్లా ఇన్‌ఛార్జి, నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ల సాక్షిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీడియాను అనుమతించకుండా నాలుగు గోడల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధ్యక్షతన నిర్వహించారు. జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజక వర్గాల్లో పార్టీని కాదని వెళ్లిపోయి తిరిగి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావుతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతోందనే అంశం చర్చనీయాంశమైంది. తిరుగుబాటు తప్పదని తెలిసి... తొలుత నియోజకవర్గాల వారీగా సమీక్షించాలనుకున్నారు. అలా అయితే నేతలు, క్యాడర్లో ఉన్న అసంతృప్తులను చక్కదిద్దడం సమస్యవుతుందనే భయంతో నాలుగైదు నియోజకవర్గాలు కలిపి సమీక్షించారు. కొన్ని నియోజకవర్గాల సమీక్షలో కొందరు నేతలు నేరుగా పార్టీ పెద్దల సమక్షంలోనే తాము చెప్పదలుచుకున్న విషయాలు కుండబద్దలు కొట్టగా, మరికొందరు ముఖ్యనేతలను విడిగా కలిసి కొత్తగా వచ్చిన నేతలతో ఉన్న తలపోట్లను ఏకరవుపెట్టుకున్నారని సమాచారం. ‘కొత్తనీరు రావడం మంచిదే కానీ ఆ నీరు కలుషితమైందైతేనే ప్రమాదకరం’ అని ప్రత్తిపాడు నియోజకవర్గ సమీక్షలో కొందరు నేతలు చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు వేదికపైననున్న నేతలకు ముచ్చెమటలెక్కించాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పాతికేళ్లుగా పార్టీలో ఉన్న వారిని పక్కనబెట్టేసి కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సహా ఆ వర్గానికి చెందిన వారి పెత్తనంపై పార్టీ నేతలు ఒకింత అసహనం వ్యక్తం చేశారని తెలియవచ్చింది. సమావేశంలో బహిరంగంగా ఈ అంశాలు చెప్పే ధైర్యం చేయలేక కొందరు వ్యక్తిగతంగా కలిసి ముఖ్య నేతల వద్ద మొరబెట్టుకున్నారని సమాచారం. ఇవేమి రాజకీయాలు... ప్రత్తిపాడు సమీక్ష ప్రారంభమయ్యాక ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు నియోజకవర్గంలో ఇబ్బందులున్నాయి. కొన్ని సెట్ చేశాను, మిగిలిన వాటిని త్వరలోనే సెట్‌రైట్ చేస్తానని ఉపోద్ఘాతం ఇవ్వడంతో అక్కడ ఏమి జరుగుతుందో చెబుదామని వచ్చిన నేతలు మిన్నకుండిపోయారు. అయితే పార్టీ సీనియర్ నాయకుడు రొంగలి సూర్యారావు దీపం పథకం సహా పలు పథకాలు సక్రమంగా అమలుకావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడుకు చెందిన కొందరు నేతలు రెండు మండలాలు ఒకరు, రెండు మండలాలు మరొకరు పంచేసుకుని రాజకీయాలు చేస్తూ పార్టీలో మొదటి నుంచీ ఉన్న వారిని పక్కన పెట్టేస్తున్నారని పలువురు ప్రైవేటుగా ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగ్గంపేట నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే అంశం కూడా కొలిక్కి రాలేదు. ఇటీవలనే టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలువురు పేర్లతో సమన్వయ∙కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించగా ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ జ్యోతుల చంటిబాబు తీవ్రంగా విభేదించారని తెలియవచ్చింది. గత ఎన్నికల్లో అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చంటిబాబుకు నెహ్రూ టీడీపీలోకి రావడాన్ని ఎంతమాత్రం జీర్ణించుకోలేకున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడలేకపోతున్న క్రమంలోనే పార్టీ సమావేశంలో సమన్వయ కమిటీ ఏర్పాటులో వీరిద్దరి మధ్య అంతర్గతంగా నెలకొన్న వైషమ్యాలు బయటపడ్డాయని సమావేశం నుంచి బయటకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకోవడం వినిపించింది. నెహ్రూ ప్రతిపాదనను వ్యతిరేకించిన చంటిబాబు తనతోపాటు కాకినాడ ఎంపీ, ఎమ్మెల్యే అందరి సమక్షంలోనే సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని గట్టిగా పట్టుబట్టి అందుకు పార్టీ పెద్దలు కూడా అంగీకరించేలా కార్యకర్తలు విజయం సాధించారు. ఉపాధి లేదాయే ... రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొత్తపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమీక్ష సందర్భంగా నేతలు బాబు వస్తే జాబ్ అనిచెప్పాం, ఇప్పుడు జాబ్ లేదు..కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వలేదు. పట్టణాల్లో అందరికీ ఇళ్ళు పథకమని ప్రకటనలు చేసి ఇప్పుడు కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేని పరిస్థితిలో ఉంటే జనంలోకి ఎలా వెళ్లమంటామరని సమన్వయ కమిటీ సభ్యులు ప్రశ్నించడంతో వేదికపై ఉన్న మంత్రులు దేవినేని, రాజప్ప విస్తుపోయి అంతా సర్థుబాటవుతుందని వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీపం పథకం, రేషన్ సరఫరా, పలు సంక్షేమ పథకాల్లో విఫలమవుతున్నామని నిలదీశారు. దీనిపై మంత్రి దేవినేని ‘అన్నీ సర్దుకుంటాయని’ సమాధానిమివ్వగా మరో నియోజకవర్గానికి చెందిన సమన్వయ కమిటీ సభ్యుడు మాట్లాడుతూ రేషన్‌కు బెస్ట్ ఫింగర్ పేరుతో కుటుంబ సభ్యులందరినీ ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ప్రభుత్వ కార్యక్రమాలు వల్లెవేస్తుండగా పలువురు కార్యకర్తలు అడ్డుతగిలారని తెలిసింది. హౌస్ పర్ ఆల్ ఏమైందని, గృహ నిర్మాణంలో ఒకటైనా ఇళ్లు ఇచ్చామా, ఎన్నికల్లో బాబు వస్తే జాబు ఇస్తామన్నాం, నిరుద్యోగ బృతి ఇస్తామన్నాం, వీటిలో ఇప్పుడు ఏమిచ్చారని ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకున్నామని నేతలు మంత్రుల సాక్షిగానేచంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుకాకపోవడాన్ని నిగ్గతీసినట్టు తెలిసింది. లోటు బడ్జెట్లో ఉన్నాం, నిధులు లేక ప్రభుత్వం నడపడటం చాలా కష్టంగా ఉంది, ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియచేయండని ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి దేవినేని ముక్తాయించి సమావేశాన్ని ముగించారు.