స్వయానా ముఖ్యమంత్రి, ప్రముఖులు కొలువుదీరిన వేదికపై నుంచి ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చవని ఎవరైనా అనుకుంటారా... అందునా దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి.. అమరావతి కేంద్రంగా పాలన సాగించే వ్యక్తి ఇచ్చిన హామీలు చిటికెలో కార్యాచరణకు నోచుకోవాలి. ఆయన హామీలంటే శాసనం కింద లెక్క. కానీ తాడేపల్లిగూడెం విషయంలో స్వయానా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు 37 నెలలు కావస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు.
తాడేపల్లిగూడెం: సరిగ్గా 37 నెలల క్రితం.. కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, రాష్ట్ర మంత్రులు కొలువుదీరిన నిట్ భవనాల శంకుస్థాపన కార్యక్రమం 2015 ఆగస్టు 20న జరిగింది. శంకుస్థాపన తంతు ముగిశాక గూడెం నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అక్షరాలా 21 హామీలను అధికారికంగా ప్రకటించారు. వాటిలో ఒకటిరెండు తప్ప మిగతావన్నీ అమలు కాలేదు.
ఇదీ హామీల చిట్టా..
తాడేపల్లిగూడెంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్టేట్ కాదుకదా ఒక్క పరిశ్రమ ఆనవాలు కూడా ఇప్పటి వరకు లేదు. విమానాశ్రయ భూముల్లో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామన్నారు. భూములకు అడ్వాన్సు పొజిషన్‌ను 2017 సెప్టెంబరు 18వ తేదీన ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పనులకు ఒక్క ఇటుక కూడా పడలేదు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు ఇస్తామన్నారు. పని ప్రగతిలో ఉందని చెబుతున్నారు. ఒక్క రోడ్డు తవ్వి హౌస్‌చాంబర్ కనెక్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. విజ్జేశ్వరం నుంచి తాడేపల్లిగూడెంకు పైపులైను ద్వారా గోదావరి జలాలను తీసుకు వస్తానన్నారు. దీని కోసం మునిసిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలోనే తీర్మానం చేసింది.
పనికి నాలుగేళ్లు వచ్చినా అతీగతీ లేదు. అధునాతన జంతు కబేళా ఏర్పాటు చేస్తామన్నారు. ఉన్న కబేళాను తొలగించారు. కొత్త కబేళా నిర్మించలేదు. రోడ్డు పక్కనే రహస్యంగా జీవాలను కోస్తున్నారు. పట్ణణంలో డ్రెయిన్ల నిర్మాణానికి నిధులు ఇస్తామన్నారు. డ్రెయిన్లు కొన్ని నిర్మించారు. కనెక్షనులు ఇవ్వలేదు. గూడెం మునిసిపాలిటీ పరిధిలో చెరువుల రక్షణ, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పని పూర్తికాలేదు. పురపాలక సంఘానికి కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దానికి నిధులు మంజూరు చేయలేదు. మునిసిపాలిటీ పరిధిలో శ్మశానాల అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు.
ఇంకా పరిపాలనా పరమైన ఆమోదం రాలేదు. వర్షపునీటి సమగ్ర డ్రెయినేజీ పథకంపై ప్రకటన చేసినా ఈ పని ఎక్కడుందో తెలియని పరిస్థితి. పట్టణంలో మెరుగైన మంచినీటి సరఫరా, 37 నెలలు గడిచాక టెండర్ల స్థాయికి వచ్చింది. గూడెం పట్టణ సుందరీకరణ పనులు ప్రస్తుతం ప్రగతిలోకి వచ్చాయి. ఎడ్యుకేషన్ హబ్‌గా గూడెంను చేస్తామని సీఎం ప్రకటిం చారు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర కళాశాలలకు భవనాలు నిర్మిస్తామన్నారు. ఇవి కార్యరూపం దాల్చలేదు. పట్ణణంలో రహదారుల నిర్మాణం హామీలో కొన్ని మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి ప్రగతిలోకి రాలేదు. ప్రభుత్వ పాఠశాలల చుట్టూ ప్రహరీల నిర్మాణం పట్టాలెక్కలేదు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సౌకర్యాల కల్పన ఫైల్ కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉంది. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. 5,376 మంది లబ్ధిదారులు ఉంటే మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణాలలో ఇప్పటికి 1,400 ఇళ్లు మాత్రమే తయారయ్యాయి. అవి కూడా పేదలకు ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు.
మరో 25 హామీలు
గూడెం అభివృద్ధికి మరో 25 హామీలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన సెంట్రల్ ఐటీఐను గూడెంకు కేటాయించారు. ప్రక్రియ ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఈ దిశగా అడుగులు పడలేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం ఊసేలేదు. విమానాశ్రయ నిర్మాణం ఏర్పాటు తలంపే లేదు. నిట్ గోడ నిర్మించడానికే రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల వ్యవధి తీసుకుంది. స్వయానా సీఎం ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలు అసహనంతో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు శుక్రవారం మౌనపోరాట దీక్ష చేశారు. సీఎం అనుకూలంగా ఉన్నా.. ఇక్కడ కొందరు సైంధవులు, శిఖండులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సీఎం నేరుగా ఇచ్చిన హామీల పరిష్కారానికి శనివారం ధర్మపోరాటదీక్ష వేదికపై నుంచి ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment