దిశ చట్టం విప్లవాత్మక పరిణామం: సీఎం జగన్‌ | AP CM YS Jagan Review with officials on Navaratna | Sakshi
Sakshi News home page

‘ఉగాది రోజు వాలంటీర్లను సత్కరిద్దాం’

Published Wed, Feb 10 2021 8:34 PM | Last Updated on Wed, Feb 10 2021 9:29 PM

AP CM YS Jagan Review with officials on Navaratna - Sakshi

అమరావతి: సమష్టి కృషితోనే విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో దిశ చట్టం ఒక విప్లవాత్మక పరిణామమని పేర్కొన్నారు. విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో వ్యయ నియంత్రణపై మనం తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించిందని చెప్పారు. మన విధానాలు మిగిలిన రాష్ట్రాలను ఆకర్షించాయని పేర్కొన్నారు. ఉగాది రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు సత్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇద్దామని అధికారులకు చెప్పారు.

తాడేపల్లిగూడెంలోని క్యాంపు‌ కార్యాలయంలో బుధవారం నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం చేపట్టిన టెండర్ల జ్యూడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానం మన ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన, గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం, భూముల సమగ్ర రీసర్వేను ఈ 20 నెలల్లోనే చేపట్టగలిగామని వివరించారు.

ఉగాది రోజు వారిని సత్కరించాలి
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను మనం ‘ఓన్‌’ చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలని అధికారులకు ఆదేశించారు. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలని చెప్పారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, కొందరు జీతాల పెంపు కోసం రోడ్డెక్కడం తనకు బాధ కలిగించిందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థలను మెరుగైన సేవలందించడం కోసమే ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. వాలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధమని స్పష్టం చేశారు. ఉగాది రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో వారికి సత్కారం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇద్దామని అధికారులకు చెప్పారు. వాలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement