బాబు పాలనలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం
ఎంఎస్‌ఈడీసీ అధ్యక్షుడు బీవీ రామారావు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం కావడానికి ప్రధాన కారకుడు సీఎం చంద్రబాబేనని మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఈడీసీ) అధ్యక్షుడు బీవీ రామారావు మండిపడ్డారు. పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సదస్సులు నిర్వహించి ఏం సాధించారని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో ఉన్న పరిశ్రమలు కూడా మూతపడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్ల చంద్రబాబుకే ఉపయోగం తప్ప పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఓట్ల కొనుగోలుకు ఉపయోగపడుతుందన్న కుయుక్తిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు ఏవీ రాకపోగా..ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల పారిశ్రామిక రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్యసదస్సులో ఒక ఏడాది 4 లక్షల 83 వేల కోట్లు, రెండో సంవత్సరంలో 11 లక్షల 22 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని బాహాటంగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.