అయ్యో పాపం
– పాడుబడ్డ ఇంట్లో పసికందు మృతదేహం
మంత్రాలయం : ఆడబిడ్డ భారమో.. శిశువు ఆకస్మిక మరణమో.. లేక మగ అంహకార పాపమో.. ఏమైనా ఓ తల్లి తనపేగును పంచుకుని పుట్టిన పసికందును పాడుబడ్డ ఇంట చెదారంలో పారవేసింది. అమ్మతనానికి మచ్చను తెచ్చుకునేలా చేసింది. ఈ ఘటన మంత్రాలయం మండలం మాధవరం గ్రామం నడిబొడ్డు ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఆటాడుకుంటుండగా.. ఆర్‌ఎంపీ నాగరాజు ఇంటి గోడను ఆనుకుని పాడుబడిన ఇంటిలో మృత శిశువు కనిపించింది.
దీంతో చిన్నోడు భయపడి అక్కడ పాప ఉందని వీధిలో వారికి చెప్పాడు. వెళ్లిచూడగా మృత శిశువు.. పుట్టిన పసిగుడ్డ నుంచి ఆహార నాళం వేరుచేయలేదు. పసికందును ఇలా పారవేయడం పాపమంటూ స్థానికులు బాధను వెలిబుచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ శ్మశాన వాటికలో మృత శిశువుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆర్‌ఎంపీ ఇంటి గోడ చాటునే ఆడ శిశువు మృతదేహం కనబడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే అబార్షన్ చేసి ఉంటాడని కొందరు పేర్కొంటున్నారు. కాన్పు జరగడంలో చనిపోయి ఉంటే పారవేశారేమోనని మరికొందరు చర్చించుకున్నారు.