Old home
-
రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. అప్పటి నుంచి ఆయన కోలుకుంటూ వస్తుండగా.. ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు నందినినగర్‌లోని కేసీఆర్ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు. -
అయ్యో పాపం
– పాడుబడ్డ ఇంట్లో పసికందు మృతదేహం మంత్రాలయం : ఆడబిడ్డ భారమో.. శిశువు ఆకస్మిక మరణమో.. లేక మగ అంహకార పాపమో.. ఏమైనా ఓ తల్లి తనపేగును పంచుకుని పుట్టిన పసికందును పాడుబడ్డ ఇంట చెదారంలో పారవేసింది. అమ్మతనానికి మచ్చను తెచ్చుకునేలా చేసింది. ఈ ఘటన మంత్రాలయం మండలం మాధవరం గ్రామం నడిబొడ్డు ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ చిన్నారి ఆటాడుకుంటుండగా.. ఆర్ఎంపీ నాగరాజు ఇంటి గోడను ఆనుకుని పాడుబడిన ఇంటిలో మృత శిశువు కనిపించింది. దీంతో చిన్నోడు భయపడి అక్కడ పాప ఉందని వీధిలో వారికి చెప్పాడు. వెళ్లిచూడగా మృత శిశువు.. పుట్టిన పసిగుడ్డ నుంచి ఆహార నాళం వేరుచేయలేదు. పసికందును ఇలా పారవేయడం పాపమంటూ స్థానికులు బాధను వెలిబుచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ శ్మశాన వాటికలో మృత శిశువుకు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆర్ఎంపీ ఇంటి గోడ చాటునే ఆడ శిశువు మృతదేహం కనబడటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనే అబార్షన్ చేసి ఉంటాడని కొందరు పేర్కొంటున్నారు. కాన్పు జరగడంలో చనిపోయి ఉంటే పారవేశారేమోనని మరికొందరు చర్చించుకున్నారు. -
పాత గూటికి కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పాత గూటికి తిరిగి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి కౌశాం బీలోని సొంత ఇంటికి మంగళవారం ప్రవేశించారు. సీఎం కాకముందు కేజ్రీవాల్ ఘజియాబాద్‌లోని కౌశాంబీ అపార్టుమెంటులోనే నివసించేవారు. ఐఆర్ఎస్ అధికారిణి అయిన తన భార్య సునీతకు మంజూరయిన ఫ్లాట్‌లో ఆయన నివాసముండేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన నివాసం ఢిల్లీలోని తిలక్‌లేన్‌కు మారింది. అయితే 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. దేశవ్యాప్తంగా పర్యటించాల్సి రావడం, తన సంతానం చదువుల దృష్ట్యా ఆయన ఇప్పటి వరకు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆయన పలుసార్లు నోటీసులు కూడా అందుకున్నారు. ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించిన కేజ్రీవాల్ ఇదేనగరంలో నివాసముండాలని అనుకున్నారు. అందుకే ఇళ్లు వెదికారు. ఒకటి రెండు చోట్ల సంప్రదింపులు జరిగినప్పటికీ ఆయన అవసరాలకు తగిన ఇల్లు ఢిల్లీలో దోరకలేదు. దాని తో ఆయన కౌశాంబీలోని పాత ఇంటికే మకాం మార్చారు. ఈ ఫ్లాట్‌లో కేజ్రీవాల్.. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తారు.