పాత గూటికి కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పాత గూటికి తిరిగి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రభుత్వం తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి కౌశాం బీలోని సొంత ఇంటికి మంగళవారం ప్రవేశించారు. సీఎం కాకముందు కేజ్రీవాల్ ఘజియాబాద్‌లోని కౌశాంబీ అపార్టుమెంటులోనే నివసించేవారు. ఐఆర్‌ఎస్ అధికారిణి అయిన తన భార్య సునీతకు మంజూరయిన ఫ్లాట్‌లో ఆయన నివాసముండేవారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన నివాసం ఢిల్లీలోని తిలక్‌లేన్‌కు మారింది. అయితే 49 రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇవ్వడంతో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది.
దేశవ్యాప్తంగా పర్యటించాల్సి రావడం, తన సంతానం చదువుల దృష్ట్యా ఆయన ఇప్పటి వరకు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి ఆయన పలుసార్లు నోటీసులు కూడా అందుకున్నారు. ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించిన కేజ్రీవాల్ ఇదేనగరంలో నివాసముండాలని అనుకున్నారు. అందుకే ఇళ్లు వెదికారు. ఒకటి రెండు చోట్ల సంప్రదింపులు జరిగినప్పటికీ ఆయన అవసరాలకు తగిన ఇల్లు ఢిల్లీలో దోరకలేదు. దాని తో ఆయన కౌశాంబీలోని పాత ఇంటికే మకాం మార్చారు. ఈ ఫ్లాట్లో కేజ్రీవాల్.. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తారు.