- 13వతేదిన అంకురార్పణ
- ఈ నెలలో రెండుసార్లు గరుడ వాహన సేవ
సాక్షి,తిరుమల
తిరుమల ఆలయంలో జరిగే దోషాల నివారణకోసం నిర్వహించే పవిత్రోత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు 13వ తేదీన శాస్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. టీటీడీ ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది.
ముందురోజు రాత్రి అంకురార్పణలో భాగంగా 7 గంటలకు శ్రీవారి సేనాపతి విష్వక్సేనుడిని ఊరేగింపుగా ఆలయం వెలుపల వసంత మండపంలో వేంచేపు చేస్తారు. తర్వాత వైఖానస ఆగమోక్తకంగా మృత్సంగ్రహణం, అంకురార్పణం, ఆస్థానం చేస్తారు. అనంతరం ఉత్సవంలో భాగంగా తొలిరోజు శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి పవిత్రోత్సవ మండ పం వేంచేపు చేసి పట్టు పవిత్రాలను ( పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. రెండోరోజు పట్టు పవిత్రాలు సమర్పించనున్నారు. చివరి రోజు పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగిస్తారు.
ఈనెలలో రెండుసార్లు గరుడసేవ
ఈ నెల 7న గరుడ పంచమి, 18న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య తన భక్తాగ్రేసుడైన సుపర్ణునిపై మలయప్ప ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.