బాలల చెంతకు అమృతం
♦ పోషకాహారలోపంఅధిగమించే ప్రయత్నం
♦ నేటి నుంచి జిల్లాలో బాలామృతం పంపిణీకి శ్రీకారం
పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు... దీంతో పలువురు వ్యాధుల బారిన పడుతున్నారు... ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది... పట్టణాల్లో మురికి వాడలతోపాటు గ్రామీణ ప్రాంత బాలబాలికల్లో శారీరక, మానసిక అభివృద్దికి అనుబంధ పోషకాహారంగా బాలమృతం పథకాన్ని ప్రవేశపెడుతున్నారు... నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది.
కడప కోటిరెడ్డిసర్కిల్ :
ఉమ్మడి రాష్ట్రం విడిపోకముందే ఖనిజ లవణాలతో కూడిన బలమైన పోషకాహార పదార్థాల మిశ్రమాన్ని బాలామృతం పేరుతో పంపిణీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ పథకం నిలిచిపోవడంతో పంపిణీ ఆగిపోయింది. మూడేళ్లుగా దీనికి ప్రత్యామ్నాయంగా పలు రకాలైన పోషకాహారాన్ని అదనంగా అందించారు. తొలుత కుర్కురేలు, శనగలు ఇచ్చారు. ఎక్కువగా వస్తున్న శారీరక లోపాలను అరికట్టేందుకు ఆహార పదార్థాలను కూడా అందించారు. ఒక్కొక్క చిన్నారికి మూడు కిలోల బియ్యం, 500 గ్రాముల కందిపప్పు, 450 గ్రాముల వంటనూనె ఇంటికి అందించేవారు. ఇప్పుడు దీని స్థానంలో ప్రవేశ పెడుతున్న బాలామృతంతో టీహెచ్‌ఆర్‌ను రద్దు చేయనున్నా రు. జిల్లాలో 3621 అంగన్‌వాడీ కేంద్రాల్లో 203 281 మంది బాలబాలికలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సన్నద్ధమవుతోంది.
ఇది ఎంతో ప్రయోజనం
ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న బాలబాలికలకు బాలామృతం ద్వారా లబ్ధి చేకూరనుంది. బాలామృతం పథకాన్ని తొమ్మిది రకాల పోషక పదార్థాలతో రూపొందించారు. క్యాల్షియం, ఐరన్, విటమిన్–ఎ, బీ1, బీ2, సి, పోలిక్ యాసిడ్, నియాసిన్ ఖనిజ లవణాలు ఉన్నాయి. వేయించిన శనగ పప్పు, గోధుమపిండి, రీఫైండ్ ఆయిల్, పంచదార, స్కిమ్‌డ్ మిల్క్ పౌడర్‌తో కలిపి రుచికరంగా తయారు చేశారు. ఒక్కొక్కరికి 100 గ్రాముల చొప్పున అందిస్తారు. అయితే నెలలో 25 రోజులు మాత్రమే ఐసీడీఎస్ ద్వారా సరఫరా చేస్తారు. ఏడు నెలల నుంచి ఏడాది వరకు పాలలో కలిపి తాపించాలి. ఏడాది నుంచి మూడేళ్ల వరకు పాలు లేదా వేడి నీళ్లలో ముద్దగా చేసి తినిపించాలి. ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల ఎదుగుదలకు ఇదెంతో కీలకంగా ఉపయోగ పడుతుందని ఐసీడీఎస్ సిబ్బంది పేర్కొంటున్నారు.