అరటి ధర హాసం
సంక్రాంతితో జోరందుకున్న ఎగుమతులు
తమిళనాడులో పెరిగిన డిమాండ్
రావులపాలెం : కొద్ది రోజులుగా ధర లేక వెలవెలబోయిన రావులపాలెం (కొత్తపేట) అరటి మార్కెట్ యార్డులో ఎగుమతులు జోరందుకున్నాయి. అరటికి ధర పెరగడంతో రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ గిట్టుబాటు ధరలేక నష్టాలు చవిచూసిన రైతులకు పెరిగిన ధరలు కొంత ఉపశమనం కలిగించాయి. తమిళనాడులో అరటి దిగుబడి తగ్గడంతో అక్కడి వ్యాపారులు రావులపాలెం మార్కెట్‌కు రావడంతో ధరలు పెరిగాయి. సంక్రాంతికి వినియోగం పెరిగే అవకాశాలు ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు ఎగుమతులు పెరగడంతో ధరలు ఊపందుకున్నాయి.
యార్డు పరిధిలోని సుమారు 20 వేల ఎకరాల్లో నిన్నమొన్నటి వరకూ గెలలు కోయని రైతులు పెరిగిన ధరతో కోతలు ముమ్మరం చేశారు. 80 శాతం పంట పూర్తి కావడంతో ఉన్న 20 శాతం పంటలో పక్వానికి వచ్చిన ప్రతీ గెలను రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ ధరల లేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరలతో కాస్త కోలుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం యార్డు పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట, కపిలేశ్వరపురం, మండపేట, పి.గన్నవరం, పెనుగొండ, పెరవలి, మార్టేరు మండలాల నుంచి రోజుకు 10 నుంచి 20 వేల గెలను అమ్మకానికి తీసుకువస్తున్నారు. తమిళనాడు, ఒరిస్సా, బీహర్, తదితర రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 15 నుంచి 20 లారీల సరుకు రవాణా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.15 నుండి రూ.20 లక్షల వ్యాపారం జరుగుతుంది.
ఎగుమతులు పెరిగాయి
నిన్నమొన్నటి వరకూ సరైన ధర లేక అంతమాత్రంగా కొనుగోళ్లు జరిగాయి. ప్రసుత్తం తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో వినియోగం పెరడంతో ధర పెరిగింది. ఎగుమతులు కూడా జోరందుకున్నాయి. మరో రెండు వారాల పాటు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది.
- కోనాల చంద్రశేఖరరెడ్డి, వ్యాపారి
పెరిగిన ధరలు ఊరటనిస్తున్నాయి
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అరటి సాగులో తీవ్ర నష్టాలు చవిచూశాం. చాలా రోజుల తరువాత అరటి ధరలు పెరగడం ఊరటనిస్తోంది. మరి కొద్ది రోజులు మార్కెట్ ఇదే విధంగా ఉంటే రైతులు నష్టాల నుంచి బయటపడతారు. - నామాల ఏసుప్రసాద్, రైతు, ర్యాలి