జాయింట్ కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం అందిస్తున్నప్పుడు పక్కనే ఉన్న జోగిపేట భాస్కర్ (సర్కిల్‌లో)
♦ ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్ల రుణం
♦ ఆపై సర్కార్ భూములు కాపాడాలని హడావుడి
♦ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి అధికారులకు విజ్ఞప్తి
కూకట్‌పల్లి: ప్రభుత్వ భూమి తనఖా పెట్టి రూ.10 కోట్లు రుణంగా పొందిన ఓ ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దొంగే దొంగా..దొంగా అన్నట్లుగా తానే ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపి బ్యాంక్ నుంచి కోట్లు రుణం పొందడమే కాకుండా.. ఆ ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యేతో కలిసి అధికారులను కోరడం గమనార్హం. బాలానగర్ మండల పరిధిలోని శంశీగూడ గ్రామ సర్వేనెం. 57లో 294 ఎకరాలు ఖాస్రా పహాణి ప్రకారం ప్రభుత్వ భూమిగా రికార్డులో ఉంది.
అయితే సర్వే నెం.57/3/1 పేరుతో 9 వేల గజాల స్థలాన్ని శంశీగూడకు చెందిన జోగిపేట భాస్కర్ అనే వ్యక్తి యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఠి బ్రాంచిలో 30 డిసెంబర్ 2011లో తనఖా పెట్టి రూ. 10 కోట్లు రుణం పొందాడు. అయితే క్షేత్ర స్థాయిలో ఎలాంటి ప్రత్యేక బై నెంబర్‌లతో పట్టాభూమి లేకపోగా, రెవెన్యూ రికార్డుల ప్రకారం 57/3/1 సర్వే నెంబర్ కూడా లేదని రెవెన్యూ అధికారులంటున్నారు. ద్విచక్ర వాహనానికి రుణం మంజూరుకు కూడా సరైన కాగితాలు లేవనే సాకుతో దరఖాస్తుదారుడిని వెనక్కి పంపే బ్యాంకు అధికారులు ఏకంగా ప్రభుత్వ భూమిని తనఖా పెట్టుకొని రూ. 10 కోట్ల రుణం మంజూరు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కార్పొరేటర్ ఫిర్యాదుతో వెలుగులోకి...
తాను చేసిన మోసాలు బయటకు పొక్కనీయకుండా వ్యవహారం చక్కబెట్టడంలో నేర్పరి అయిన భాస్కర్ ఏకంగా స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి గ్రామంలోని ప్రభుత్వ భూములను కాపాడాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25న స్థానిక కార్పొరేటర్ డి.వెంకటేశ్‌గౌడ్ శంశీగూడ గ్రామంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, బాలానగర్ మండల తహసీల్దార్‌లకు వినతి పత్రాలను అందజేశారు. సదరు వినతి పత్రంలో సర్వేనెం. 57లో బై నెంబర్‌ల పేరుతో కబ్జాచేయడమే కాకుండా బ్యాంకు నుంచి రుణం పొందిన భాస్కర్ మోసాన్ని బయటపెట్టారు. కాగా, మరుసటి రోజే ఎమ్మెల్యేతో కలిసి భాస్కర్ జాయింట్ కలెక్టర్‌ను కలువడం అనుమానాలకు తావిస్తోంది.
ఉలిక్కి పడ్డ బ్యాంక్ అధికారులు
ప్రభుత్వ భూమికి పదికోట్ల రుణం మంజూరు చేసిన బ్యాంక్ అధికారులు ఐదేళ్లకు ఆలస్యంగా మేల్కొన్నారు. బుధ, గురువారాలలో బాలానగర్ మండల కార్యాలయంలో, శంశీగూడ గ్రామంలో సదరు రుణం మంజూరు చేసిన భూముల వివరాలను కనుక్కొనేందుకు యత్నించారు. రెవెన్యూ రికార్డుల్లో లేకపోగా క్షేత్ర స్థాయిలో చూపించిన ఫొటోలకు, భూములకు పొంతన లేకపోవడంతో ఆందోళనకు గురైనట్లు తెలిసింది. కాగా, ఎప్పటికప్పుడు పార్టీలు మారుస్తూ తన తప్పులు బయటికి రాకుండా చూసుకుంటున్న భాస్కర్‌పై గతంలోనే తహసీల్దార్ వనజాదేవి భూ కబ్జాకేసు నమోదు చేయడం గమనార్హం.