మూతపడిన బ్యాంకులు
మూతపడిన బ్యాంకులు
Published Tue, Aug 22 2017 10:50 PM | Last Updated on Sun, Sep 17 2017 5:51 PM
నిలిచిన రూ.300 కోట్ల లావాదేవీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా బ్యాంకర్లు మంగళవారం బంద్ పాటించారు. సుమారు 400 వివిధ బ్యాంకులు మూతపడగా రూ.300 కోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి కేజేఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు చర్యలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1968లో బ్యాంకులను జాతీయం చేసే సమయానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో రూ.3,600 కోట్లు మాత్రమే డిపాజిట్లు ఉండేవని, నేడవి రూ.కోటీ 5 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల విలీనం ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం ఇటీవల పేద మధ్యతరగతి వర్గాల నుంచి ఫీజుల రూపంలో అధికంగా వసూలు చేసి, ఆ మొత్తాన్ని కార్పొరేట్ బ్యాంకుల నష్టాల భర్తీకి వినియోగించడం దారుణమని అన్నారు. జాతీయ బ్యాంకుల్లో దేశ వ్యాప్తంగా రూ.2.76 లక్షల కోట్ల రుణాల బకాయిలు ఉన్నాయని, వాటిలో రూ.1.80 లక్షల కోట్లు 14 మంది వ్యక్తులకు చెందినవి కావడం శోచనీయమని తెలిపారు. ఆ మొండి బకాయిలను వసూలు చేసే దిశగా చర్యలు తీసుకోకుండా పేదలపై భారం వేయడం కేంద్ర ప్రభుత్వ దమననీతికి నిదర్శనమన్నారు. బ్యాంకుల్లో అవసరమైన ఉద్యోగులు లేక ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగిపోయిందని, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే సెప్టెంబర్‌లో రెండు రోజులు, నవంబర్‌లో రెండు రోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
Advertisement