బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె విజయవంతం
Published Tue, Feb 28 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
స్తంభించిన రూ.ఐదువందల కోట్ల లావాదేవీలు
బాలాజీచెరువు (కాకినాడ): ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు మంగళవారం జిల్లావ్యాప్తంగా నిలిచిపోయాయి. వేతన సంబంధిత అంశాలతో పాటు పలు సమస్యల పరిష్కారానికి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకూ జిల్లాలో ఉన్న కాకినాడ, అమలాపురం, పిఠాపురం, రాజమండ్రి తదితర డివిజన్లలో ఉన్న 700 ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది ఐదువేల మంది విధులకు దూరంగా ఉండటంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అన్ని బ్రాంచ్‌లలో కలిపి రూ.ఐదు వందల కోట్ల వరకూ ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. బ్యాంకింగ్ రంగంలో పర్మినెంట్ ఉద్యోగాలు మాత్రమే ఉండాలని, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో ఎక్కువ సమయం విధులు నిర్వహించిన సిబ్బందికి తగిన పారితోషికం ఇవ్వాలని, బ్యాంక్ ఉద్యోగులకు తదుపరి వేతన సవరణ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అన్ని విభాగాల్లో రిక్రూట్‌మెంట్లు ప్రారంభించాలంటూ నినాదాలు చేశారు. ముఖ్యంగా మొండి బకాయిల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు టాప్ ఎగ్జిక్యూటివ్‌ను బాధ్యులను చేయడంతో పాటు ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ యూనియన్ ఫోరం కన్వీనర్ పి.ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ సమ్మెలో అన్ని బ్యాంక్ బ్రాంచ్‌ల సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Advertisement
Advertisement