గుట్టుగా గుట్కా.. జోరుగా వ్యాపారం
- అపహాస్యం పాలవుతున్న నిషేధం
- వరంగల్ కేంద్రంగా జిల్లావ్యాప్తంగా సరఫరా
- పట్టించుకోని పోలీసు, ఎక్సైజ్ శాఖలు
‘పైన పటారం లోన లోటారం’ అన్నట్లుగా ఉంది జిల్లాలో గుట్కాలపై నిషేధం అమలు. గుట్కా అమ్మకాలపై నజర్ ఉందని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ జిల్లాలోని ప్రతి గల్లీలో, చిన్న చిన్న షాపుల్లో కూడా గుట్కాలు విరివిగా లభిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచే అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నా అడ్డుకునే నాథుడే లేడు.
సాక్షి, హన్మకొండ : పొగాకు సంబంధిత ఉత్పత్తి అయిన గుట్కాలు నమలడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది. పొగాకు ఉత్పత్తులతో తయారైన గుట్కాలను అమ్మడం చట్టరీత్యా నేరం. పొగాకు కలపకుండా కేవలం వక్క పలుకులు, సుగంధ పరిమళం ఉండే పాన్ మసాలా, స్వీట్ సుపారీ, వక్క పొట్లాల అమ్మకంపై ఎటువంటి నిషేధం లేదు. దీంతో గుట్కా తయారీ కంపెనీలు, వ్యాపారులు సరికొత్త ఎత్తుగడకు తెరలేపారు. నిషేధం లేని పాన్ మసాలా, స్వీట్ సుపారీలను బహిరంగగా, వీటికి అనుబంధంగా పొగాకు పొడిని ప్రత్యేకంగా అమ్ముతున్నారు.
ఈ పొగాకు ఉత్పత్తిపై నిషేధం ఉండటంతో దీన్ని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు. గుట్కాలు కావాల్సిన వారు పాన్ మసాలా, పొగాకు పొడిని మార్కెట్‌లో ఒకే వ్యక్తి దగ్గర వేర్వేరు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఈ రెండింటినీ కలిపితే గుట్కాగా మారుతుంది. నిషేధం విధించిన తొలిరోజుల్లో గుట్కా వ్యాపారులు అమలు చేసిన ఈ వ్యూహం ఫలించడంతో ప్రభుత్వ నిర్ణయూన్ని అపహాస్యం పాలు చేశారు. ప్రత్యక్ష పొగాకు ఉత్పత్తులైన గుట్కాలు, ఖైనీలను బహిరంగగానే అమ్ముతున్నారు.
వరంగల్ నుంచే జిల్లా మొత్తానికి..
గుట్కాపై నిషేధం ఉండటంతో రాష్ట్రంలో వాటి తయారీ నిలిచిపోయింది. దీంతో కర్నాటక, మహారాష్ట్రల నుంచి గుట్కాలు వరంగల్‌కు వస్తున్నాయి. నిషేధం లేని సాధారణ వస్తువుల మధ్య పైకి కనిపించకుండా ప్యాక్ చేసి కొరియర్, ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. నగరానికి చేరిన గుట్కాలను పిన్నావారి వీధి, పాత బీటుబజారు, కొత్తవాడ, కాశిబుగ్గ, శివనగర్, లక్ష్మీపురం, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. అనువైన సమయం చూసి పాన్ మసాలా, సిగరేట్ ప్యాకెట్లు పంపిణీ చేసే వ్యక్తుల ద్వారా గుట్కాలను జిల్లా నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా బడ్డీ కొట్టు, పాన్‌షాప్, కిరాణా షాపులలో గుట్కాల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.
పట్టించుకోని అధికారులు..
నిషేధం విధించిన పొగాకు ఉత్పత్తులను యథేచ్ఛగా విక్రరుుస్తున్నా పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అరకొరగా దాడులు నిర్వహించడం మినహా కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఆకస్మిక తనిఖీలు చేస్తే ప్రతీ గల్లీలో గుట్కాలు బయటపడతాయి. కానీ ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదని, గుట్కా వ్యాపారుల నుంచి వారికి మామూళ్లు అందుతున్నాయని పలువరు ఆరోపిస్తున్నారు. అందుకే గుట్కా అక్రమ వ్యాపారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.