గ్రామాల్లో కనీస సౌకర్యాలు కరువు
– గడప గడపకు వైఎస్సార్‌లో సమస్యల వెల్లువ
బి.కోడూరు : గ్రామాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, వీధిదీపాలకు కూడా తాము నోచుకోలేదని వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య ఎదుట తంగేడుపల్లె వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని తంగేడుపల్లె, తంగేడుపల్లె బీసీకాలనీ, ఎస్సీకాలనీ, తుమ్మలపల్లె, తుమ్మలపల్లె ఎస్సీకాలనీల్లో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తంగేడుపల్లె ఎస్సీకాలనీ వాసులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా తమ కాలనీలో, గ్రామంలో ఎక్కడ కూడా వీధిదీపాలు వెలగలేదన్నారు. రాత్రివేళలో విషపురుగులు సంచరిస్తున్నాయని, అంతేకాకుండా పలువురు ప్రమాదాలకు కూడా గురయ్యాయని వారు వాపోయారు. ఓట్లు వేయించుకుని గెలిచిన ప్రజాప్రతినిధులు తమగోడును పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పక్కా ఇళ్ల కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నామన్నారు. సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికీ వైఎస్ హయాంలో ఏ విధంగా ఇళ్ల నిర్మాణం జరిగిందో అదేవిధంగా పక్కాఇళ్లు అందించి పేదవారి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. టీడీపీ నాయకుల మాదిరి అలివికాని హామీలను చెప్పి మాట తప్పడం జగన్‌మోహన్‌రెడ్డికి చేతకాదని, చెప్పిన మాటకు కట్టుబడి పనిచేస్తారన్నారు. ఎన్నికలప్పుడు మళ్లీ మీ వద్దకు టీడీపీ నేతలు వస్తారు, అప్పుడు వారిని నిలదీసి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ వై.యోగానందరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు ఓ.ప్రభాకర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు శివశంకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, రాజారెడ్డి, కేశవరెడ్డి, శేషారెడ్డి, వై.సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, రాజా, గుర్రయ్య, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.