ఒక్కేసి.. పువ్వేసి...
పరవశించే ప్రకృతి పరిమళాలు..
బతుకమ్మ పూలల్లో ఔషధ గుణాలు
అందరికీ ఆరోగ్య ఫలాలు
జోగిపేట: సంప్రదాయబద్దంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మది ప్రత్యేక స్థానం. పువ్వులు.. ఆకులు.. గౌరమ్మలు.. పసుపుకుంకుమలు.. ప్రకృతి ఒడిలో విరబూసే పూలు అందాన్ని, పరిమళాలను వెదజల్లడమే కాక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ప్రతి పువ్వులో ఔషధాలు మెండుగా ఉన్నాయి. తంగేడు, గునుగు, చంద్రకాంత, గడ్డిపూలు, గుమ్మడి, మందార పూలకు ఎంతో గొప్ప విశిష్టత ఉంది. బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా కూడా బోలెడు ప్రయోజనాలున్నాయి.
చెరువు నీటిలో ఉన్న మలినాలు ఔషధ గుణాలు కలిగిన పూలతో మటుమాయమై నీటి శుద్ధి జరుగుతుంది. ఇలా బతుకమ్మ ఆట, పాటలకే కాకుండా ఆరోగ్యాన్ని పెంపొందించడంలోనూ దోహద పడుతోంది. ఇదిలా ఉండగా..భక్తిశ్రద్ధలతో పూలు పేర్చి.. పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ.. మహిళలు ఇళ్లల్లో.. ఆలయాల్లో.. కూడళ్లలో.. రెండో రోజైన శనివారం అటుకుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.