పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి
పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి
Published Sun, Nov 6 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): బీసీలకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో 56 శాతం రిజర్లేషన్ల కల్పన కోసం వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలుకు వచ్చిన ఆయన స్టేట్ గెస్టు హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, చంద్రశేఖరరావు ఢిల్లీకి అఖిలపక్షాలు, బీసీ సంఘాలను తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలు, పార్లమెంటులో ఆమోదం తెలపాలని కోరారు. బీసీలు సంఘటితంగా ఒక్కటిగా పోరాడి రిజర్వేషన్లను సాధించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. త్వరలో బీసీల రిజర్వేషన్ల కోసం కర్నూలులో రెండు లక్షలమందితో మహాసభను నిర్వహించనున్నట్లు చెప్పారు. పిల్లలు లేరనే సాకుతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను మూసివేస్తున్నారని, ఇది తగదని హెచ్చరించారు. వాటి స్థానంలో రెసిడెన్షియల్ హాస్టళ్లను నిర్మించాలని కోరారు. వర్సిటీల్లో చదివే విద్యార్థుల స్కాలర్‌షిప్పును రూ.1050 నుంచి రూ. 2500 వరకు పెంచాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఫీజ్‌రీయింబర్స్ మెంట్ కేవలం 35 వేల రూపాయలను మాత్రమే ఇస్తుండడంతో చాలా మంది బీసీ విద్యార్థులు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ జాతీయ నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వై.నాగేశ్వరయాదవ్, నాయకులు రామకృష్ణ, భాస్కర్, పార్వతమ్మ, పుల్లన్న, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
Advertisement