మాట్లాడుతున్న దత్తాత్రేయ, చిత్రంలో దేవేందర్ గౌడ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఎన్.రావు, స్వాతంత్య్ర సమరయోధులు డాక్ట
నాంపల్లి: బీసీ నేత ప్రధానమంత్రి అయినప్పుడు.. బీసీలు ముఖ్యమంత్రి కావడం పెద్ద కష్టమేమీ కాదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్‌మెంట్ సంస్థ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల్లోని అన్ని కులాలు ఒకే వేదికపైకి వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధించవచ్చని చెప్పారు.
రాజ్యసభ సభ్యులు దేవేందర్ గౌడ్ రాజకీయాల్లో ఉంటూ రాజకీయంగా బీసీలను చైతన్యం చేసేందుకు ఒక వేదికను తయారు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న క్యాజువాలిటీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించి తగు న్యాయం చేస్తామని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎన్.రావు మాట్లాడుతూ బీసీల్లో ఐకమత్యం లేదని, అందరం కలిసి ఒక్కటైతేనే బీసీలకు రాజ్యాధికారం తథ్యమన్నారు.
2019 నాటికి ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావ దిశగా ముందుకు వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యులు, బీసీ సాధికారత సంస్థ అధ్యక్షులు దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా చైతన్యంతోనే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అన్నారు. అనంతరం సామాజికవేత్తల జీవిత గాధలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించారు. బీసీ భీష్మ పితామహ బాబూరావు వర్మ, వాణిజ్యపన్నుల శాఖ రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ వై.సత్యనారాయణ, డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, దళితరత్న జేబీరాజు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, సంస్థ ప్రధాన కార్యదర్శి జయ ప్రసాద్ పాల్గొన్నారు.