దీక్షలు భగ్నం..బీసీ నేతల అరెస్ట్
కర్నూలు(అర్బన్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సోమవారం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలు చేపట్టిన శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్ మీదుగా సీఎం చంద్రబాబు కాన్వాయ్ కలెక్టరేట్‌కు వెళ్తున్న నేపథ్యంలో దీక్షలను ప్రారంభంలోనే పోలీసులు అడ్డుకొన్నారు. బీసీ నేతలను రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పలువురు సీఐ, ఎస్‌ఐ, పోలీసులు అక్కడికి చేరుకొని శిబిరాన్ని తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులకు బీసీ నేతలకు కొంతసేపు వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు పీజీ నరసింహులుయాదవ్, బీసీ జనసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లక్ష్మినరసింహ, రాయలసీమ జోన్ కన్వీనర్ టి శేషఫణి, యాదవ సంఘం సీనియర్ నాయకులు రాంపుల్లయ్యయాదవ్, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ.. బీసీలపై కపటప్రేమను చూపిస్తూ వారినిఅణగదొక్కేందుకు చూస్తోందన్నారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రతి బీసీ కులానికి ఫెడరేషన్లు ఏర్పాటు చేసి వారికి ఆర్థిక చేయూతను అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి మద్దిలేటియాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గంగిరెద్దుల సంఘం జాతీయ అధ్యక్షుడు సీతయ్య, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సోమన్న, ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంది వరుణ్‌కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.