బాబూ.. జాబ్‌ ఎక్కడ? | bc welfare leaders fired on ap cm chandra babu | Sakshi
Sakshi News home page

బాబూ.. జాబ్‌ ఎక్కడ?

Published Fri, Mar 24 2017 2:09 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

బాబూ.. జాబ్‌ ఎక్కడ? - Sakshi

బాబూ.. జాబ్‌ ఎక్కడ?

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు  పట్టించుకోరా?
బీసీ సంఘం నేత శంకరయ్య


శ్రీకాళహస్తి: ‘చంద్రబాబు వస్తే జాబ్‌ వస్తుందన్నారు... ఆ హామీని మరచిపోయారా’ అంటూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య అన్నారు. పట్టణంలోని కైకాలవారి కల్యాణ మండపంలో జిల్లా బీసీ నేతల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాలతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. బీసీల హక్కుల కోసం పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.30 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీ కార్పొరేషన్‌ రుణాల మంజూరులో మోసాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. బ్యాంకులతో లింక్‌ పెట్టకుండా కార్పొరేట్‌ సొసైటీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అసెంబ్లీ సమావేశాల్లో అమలు చేసి కేంద్రానికి పంపడంతోనే తమ బాధ్యత అయిపోయినట్లు సీఎం భావిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి సీఎం ఢిల్లీకి 60సార్లు వెళ్లారని అయితే ఎప్పుడు బీసీల రిజర్వేషన్‌పై మాట్లాడలేదని ఆరోపించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదని దుయ్యపట్టారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ బీసీల పార్టీ అంటూ సీఎం ప్రతి సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటారని, అయితే ఆయన బీసీలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.

ఇక బీసీ నేతలు గ్రామ స్థాయి నుంచి ఏ ప్రాంతంలో తమకు అన్యాయం జరిగితే అ ప్రాంతంలోని వారు పోరాడాలన్నారు. ఈ రెండేళ్లలోనైనా సీఎం బీసీల అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు. లేదంటే 2019 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి సరైన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. బీసీ నేతలు రమేష్, రంగయ్య, సునీల్‌కుమార్, వెంకయ్య, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement