వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కలెక్టర్ వివేక్ యాదవ్
♦ కలెక్టర్ వివేక్ యాదవ్
విజయనగరం కంటోన్మెంట్ : స్మార్ట్ పల్స్ సర్వేపై ప్రజలు అపోహలు వీడాలని కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏపీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వేపై ప్రజలకున్న అపోహలు తొలగించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించి సర్వేను వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు ఎన్యుమరేటర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇవ్వాలన్నారు. సర్వేకు వినియోగిస్తున్న ట్యాబ్‌లను ఆగస్టు 1నుంచి 5 వరకూ పింఛన్ల పంపిణీ చేసే సిబ్బందికి అందజేయాలన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సర్వేను ప్రారంభించి సాయంత్రానికి పూర్తి చేసి ట్యాబ్‌లను అప్పగించాలన్నారు. అలాగే అసంఘటిత కార్మికులకు ప్రవేశ పెట్టిన చంద్రన్న బీమా పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ గ్రీవెన్స్‌సెల్ నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్నారు. ప్రతి నెలా సివిల్ రైట్స్ డే విధిగా నిర్వహించి ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్, డీఆర్‌డీఏ పీడీ ఎస్. ఢిల్లీరావు, కేఆర్‌సీసీ ఎస్‌డీసీ ఆర్. శ్రీలత, ఎన్‌ఐసీ అధికారి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.