జీవన సౌందర్యం | Beauty of life | Sakshi
Sakshi News home page

జీవన సౌందర్యం

Published Mon, Aug 8 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

జీవన సౌందర్యం

జీవన సౌందర్యం

పచ్చని చెట్లు..లోయలు..జలపాతాలు..పక్షుల కిలకిలరావాలు..వీటన్నింటినీ వినాలన్నా, కనాలన్నా ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు, చింతపల్లి పరిసర ప్రాంతాలను సందర్శించాల్సిందే. చల్లటి వాతావరణం, మంచు తెరల దోబూచులాటలతో అహ్లాదంగా అనిపిస్తున్న ఈ ప్రాంతం పూర్తి షెడ్యూల్డు ఏరియాలో ఉన్న ఏజెన్సీ. భౌగోళికంగా ఆరువేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి.  ఆదివాసీల సంస్కతికి అద్దం పడుతుంది థింసా నృత్యం.
పాడేరు : ఆధునిక ప్రపంచానికి దూరంగా కొండ, కోనల్లో ప్రత్యేక భాషా,సంస్కృతి, సంప్రదాయల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసుకొని జీవించడం గిరిజనుల విధానం. తమ మనుగడకోసం గిరిజనుల నిత్యపోరాటం సాగిస్తుంటారు. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. విద్యా గంధం అంటని, ఆధునికతకు దూరంగా కొండ కోనల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకొని జీవిస్తున్న గిరిజనుల్లో నేటికి వారి ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూలో మార్పులేదు.  తెలుగు, ఒడియ, కోయ, కువి వంటి భాషలను మాట్లాడతారు. విశాఖ మన్యంలో భగత, కొండదొర, వాల్మీకి, కమ్మర, మాలీలు, కొటియ, నూకదొర, ఆదివాసీలైన పొర్జ, గదబ, కోందు తెగల గిరిజనులు నివశిస్తున్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు పంటలు, వ్యవసాయ పంటలు దిగుబడి వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండుగలను జరుపుకోవడం గిరిజనుల సంప్రదాయం. ఆదివాసీలు జరుపుకునే పండుగలు వారు పండించే సంప్రదాయ పంటలకు, ప్రకతికి పరిమితమవుతాయి. గిరిజనుల సంతోష సంబరాలకు ప్రతీకగా నిలిచే కొర్రకొత్త, జొడ్ల పండుగ, విటింగ్‌ పండుగ, నంది పండుగ, బారిజం వంటి పండుగలు గిరిజనులకు ప్రత్యేకం. పండుగలు, వివాహాలు చేసుకునే సమయంలో గిరిజనులు పలు నృత్యరీతులతో ఆకట్టుకుంటారు. కోందు తెగ వారు మయూరి నృత్యం, పొర్జ తెగ వారు నంది నత్యం, గదబ తెగవారు కంగారి నృత్యం, మన్యంలో మిగిలిన అన్ని తెగల వారు ధింసా నృత్యాన్ని చేస్తుంటారు. 
అడవితో అనుబంధం
అడవికి, ఆదివాసీలకు ఎన్నెన్నో ఏళ్ల అవినాభావ సంబంధం ఉంది. బ్రిటీష్‌ పాలకుల కాలంలో వాణిజ్య ప్రయోజనాల కోసం ఆనాడు అడవి నుంచి గిరిజనులను వేరు చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు గిరిజన ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. 1922–24 మధ్యకాలంలో మన్యవీరుడు అల్లూరి పోరాటం మన్యంలో సాగింది. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు గిరిజనుల జీవన సమస్యను గుర్తించి, గిరిజనులకు, ప్రభుత్వానికి ఉపయోగపడే రీతిలో ఉమ్మడి అటవీ యాజమాన్య పద్ధతిని తెచ్చి గిరిజనులకు అడవితో ఉన్న బంధాన్ని పటిష్టం చేశాయి. తరతరాలుగా పోడు వ్యవసాయంతో కొండలపై జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించేందుకు 2006 లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చింది. 
అభివృద్ధి అంతంతమాత్రం  
మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గ్రామాల్లో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు ఏర్పడటం లేదు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలకు ఆదివాసీలు దూరంగానే ఉన్నారు. రక్షిత మంచినీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. మౌలిక సౌకర్యాల కొరత వల్ల తరతరాలుగా గిరిజనులు జీవన పరిస్థితులు మెరుగు పడటం లేదు. రవాణా వ్యవస్థ విస్తరించకపోవడం వల్ల కొండ కోనల్లో కాలినడకన గిరిజనులు జీవన ప్రయాణం సాగుతోంది. ఏజెన్సీలో ఉన్న 244 పంచాయతీ కేంద్రాలల్లో కొన్నింటికి తారు రోడ్డు, మరికొన్నింటికి మెటల్‌ రోడ్లు ఉన్నప్పటికీ 60 శాతంపైగా పంచాయతీ కేంద్రాలకు రవాణా సౌకర్యాలు విస్తరించలేదు. ఏజెన్సీ 11 మండల కేంద్రాలకే రవాణా సౌకర్యం ఉంది. ఈరోడ్డు శివారు పంచాయతీలకే రవాణా సౌకర్యం ఉంది. డివిజనల్‌ కేంద్రమైన పాడేరు మండలంలోనే 26 పంచాయతీల్లో 16 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదు. 
నిష్ఫలమవుతున్న మంచినీటి పథకాలు..
మన్యంలో గిరిజనులకు తాగునీటి కొరత ప్రధాన సమస్యగా ఉంది.  రక్షిత మంచినీరు గిరిజనులకు అందుబాటులో లేదు. కొండల దిగువన ఉండే గ్రామాల్లో గిరిజనులకు ఊటగెడ్డలే తాగునీటికి ఆధారంగా ఉన్నాయి. వీటి ఆధారంగానే ప్రభుత్వం గత నాలుగైదేళ్ళలో గ్రావిటీ పథకాలను నిర్మించింది. కలుషితమవుతున్న ఈ జలాల వల్ల గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న మంచినీటి పథకాలు నిష్ఫలమవుతున్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల గిరిజనులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుడటం లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement