traible
-
గిరిజన మంత్రే లేని బాబు సర్కార్
గిరిజన సలహా మండలి ఏర్పాటులో నిర్లక్ష్యం వైద్యం అందించని దుస్థితి ఏజెన్సీ జిల్లా ఏర్పాటుకు డిమాండ్ మారేడుమిల్లి ప్లీనరీలో కన్నబాబు ధ్వజం మారేడుమిల్లి (రంపచోడవరం) : రాష్ట్ర చరిత్రలో టీడీపీ చంద్రబాబు ప్రభుత్వంలోనే గిరిజన మంత్రి లేని పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నేటికీ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకపోవడం చూస్తే గిరిజనులపై వారికి ఉన్న ప్రేమ తేటతెల్లమవుతుందన్నారు. మారేడుమిల్లిలో సోమవారం నిర్వహఙంచిన పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏజెన్సీలో పర్యటించినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు విషయంలో తక్కువ నష్టపరిహారం పొందిన ప్రతి ఎకరానికి మెరుగైన పరిహారం చెల్లిస్తామని చెప్పిన విషయాన్ గుర్తు చేశారు. సరైన వైద్యం అందక గిరిజన చిన్నారులు మృత్యువాత పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం మితిమిరిపోతుందన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం గిరిజనులను అవమాన పరచడమేనన్నారు. టీఎస్పీ నిధులు దారి మళ్ళించి ఇతర ప్రయోజనాలు కోసం వాడుతున్నారన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలను కలిపి ఏజెన్సీ జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేసే తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే, పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మాయలేడి కొత్తపల్లి గీతా నలికి కుల ధ్రువీకరణ పత్రం చూపి జగనన్న దగ్గర టికెట్ పొంది నేడు ఢీల్లికి పరిమితమైయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్లీనరీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు, ఉద్యోగులకు సీఎస్పీ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తీర్మానించాలన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్లీనరికి అధ్యక్షత వహించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ పార్టీ విజయనికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ పార్టీ అధినేతను సీఎం చేసేందుకు పనిచేయలన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలరెడ్డి, నాయకులు కొల్లి నిర్మలకుమారి, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ కోఆర్టినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, కొండేటి చిట్టిబాబు, ముత్యాల శ్రీనివాస్, పర్యత పూర్ణచంద్రపసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు ప్రసంగించారు. -
గిరిజనుడి హత్య
సరివెల (చింతూరు): మండలంలోని సరివెల గ్రామానికి చెందిన మడకం బుచ్చయ్య (36) బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పెదగుంపులో నివాసముంటున్న బుచ్చయ్యను బుధవారం రాత్రి 10 మంది వ్యక్తులు వచ్చి మాట్లాడే పనుందని తమవెంట తీసుకెళ్లారు. తెల్లవారుఝాము వరకు బుచ్చయ్య జాడ లేకపోవడంతో కుటుంబసభ్యులు సమీపంలోని పొలాల్లో వెదకగా సొంత పొలంలోనే బుచ్చయ్య మృతదేహం కనిపించింది. తలపై కర్రలతో కొట్టి, కత్తితో కడుపులో పొడిచి హత్యచేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లభ్యమైన లేఖపై అనుమానం సంఘటనా స్థలంలో మావోయిస్టుల పేరుతో ఓ లేఖ లభ్యమైంది. లేఖ అర్థవంతంగా లేకపోవడంతో వేరెవరో హత్యచేసి మావోయిస్టుల పేరుతో లేఖ పెట్టివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లభ్యమైన లేఖలో బుచ్చయ్య ఆడవాళ్లపై లైంగికదాడి చేసి హత్యచేసి జైలుకెళ్లాడని, ఈ విషయంపై సరిదిద్దుకోమని చెప్పినా వినకుండా అవే ఘటనలు పునరావృతం చేయడంతోనే అతనిని హత్యచేయాలని మా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. లేఖపై చింతూరు సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఇతనిపై అనేక ఆరోపణలున్నాయని, లభ్యమైన లేఖ మావోయిస్టులది కాదని తెలిపారు. మృతదేహాన్ని చింతూరు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
జీవన సౌందర్యం
పచ్చని చెట్లు..లోయలు..జలపాతాలు..పక్షుల కిలకిలరావాలు..వీటన్నింటినీ వినాలన్నా, కనాలన్నా ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు, చింతపల్లి పరిసర ప్రాంతాలను సందర్శించాల్సిందే. చల్లటి వాతావరణం, మంచు తెరల దోబూచులాటలతో అహ్లాదంగా అనిపిస్తున్న ఈ ప్రాంతం పూర్తి షెడ్యూల్డు ఏరియాలో ఉన్న ఏజెన్సీ. భౌగోళికంగా ఆరువేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆదివాసీల సంస్కతికి అద్దం పడుతుంది థింసా నృత్యం. పాడేరు : ఆధునిక ప్రపంచానికి దూరంగా కొండ, కోనల్లో ప్రత్యేక భాషా,సంస్కృతి, సంప్రదాయల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసుకొని జీవించడం గిరిజనుల విధానం. తమ మనుగడకోసం గిరిజనుల నిత్యపోరాటం సాగిస్తుంటారు. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. విద్యా గంధం అంటని, ఆధునికతకు దూరంగా కొండ కోనల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకొని జీవిస్తున్న గిరిజనుల్లో నేటికి వారి ఆచార వ్యవహారాలు, కట్టూ బొట్టూలో మార్పులేదు. తెలుగు, ఒడియ, కోయ, కువి వంటి భాషలను మాట్లాడతారు. విశాఖ మన్యంలో భగత, కొండదొర, వాల్మీకి, కమ్మర, మాలీలు, కొటియ, నూకదొర, ఆదివాసీలైన పొర్జ, గదబ, కోందు తెగల గిరిజనులు నివశిస్తున్నారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, పోడు పంటలు, వ్యవసాయ పంటలు దిగుబడి వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండుగలను జరుపుకోవడం గిరిజనుల సంప్రదాయం. ఆదివాసీలు జరుపుకునే పండుగలు వారు పండించే సంప్రదాయ పంటలకు, ప్రకతికి పరిమితమవుతాయి. గిరిజనుల సంతోష సంబరాలకు ప్రతీకగా నిలిచే కొర్రకొత్త, జొడ్ల పండుగ, విటింగ్ పండుగ, నంది పండుగ, బారిజం వంటి పండుగలు గిరిజనులకు ప్రత్యేకం. పండుగలు, వివాహాలు చేసుకునే సమయంలో గిరిజనులు పలు నృత్యరీతులతో ఆకట్టుకుంటారు. కోందు తెగ వారు మయూరి నృత్యం, పొర్జ తెగ వారు నంది నత్యం, గదబ తెగవారు కంగారి నృత్యం, మన్యంలో మిగిలిన అన్ని తెగల వారు ధింసా నృత్యాన్ని చేస్తుంటారు. అడవితో అనుబంధం అడవికి, ఆదివాసీలకు ఎన్నెన్నో ఏళ్ల అవినాభావ సంబంధం ఉంది. బ్రిటీష్ పాలకుల కాలంలో వాణిజ్య ప్రయోజనాల కోసం ఆనాడు అడవి నుంచి గిరిజనులను వేరు చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు గిరిజన ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. 1922–24 మధ్యకాలంలో మన్యవీరుడు అల్లూరి పోరాటం మన్యంలో సాగింది. స్వాతంత్య్రానంతరం వచ్చిన ప్రభుత్వాలు గిరిజనుల జీవన సమస్యను గుర్తించి, గిరిజనులకు, ప్రభుత్వానికి ఉపయోగపడే రీతిలో ఉమ్మడి అటవీ యాజమాన్య పద్ధతిని తెచ్చి గిరిజనులకు అడవితో ఉన్న బంధాన్ని పటిష్టం చేశాయి. తరతరాలుగా పోడు వ్యవసాయంతో కొండలపై జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులకు అటవీ భూములపై హక్కు కల్పించేందుకు 2006 లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలులోకి వచ్చింది. అభివృద్ధి అంతంతమాత్రం మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గ్రామాల్లో గిరిజనులకు మౌలిక సౌకర్యాలు ఏర్పడటం లేదు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలకు ఆదివాసీలు దూరంగానే ఉన్నారు. రక్షిత మంచినీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. మౌలిక సౌకర్యాల కొరత వల్ల తరతరాలుగా గిరిజనులు జీవన పరిస్థితులు మెరుగు పడటం లేదు. రవాణా వ్యవస్థ విస్తరించకపోవడం వల్ల కొండ కోనల్లో కాలినడకన గిరిజనులు జీవన ప్రయాణం సాగుతోంది. ఏజెన్సీలో ఉన్న 244 పంచాయతీ కేంద్రాలల్లో కొన్నింటికి తారు రోడ్డు, మరికొన్నింటికి మెటల్ రోడ్లు ఉన్నప్పటికీ 60 శాతంపైగా పంచాయతీ కేంద్రాలకు రవాణా సౌకర్యాలు విస్తరించలేదు. ఏజెన్సీ 11 మండల కేంద్రాలకే రవాణా సౌకర్యం ఉంది. ఈరోడ్డు శివారు పంచాయతీలకే రవాణా సౌకర్యం ఉంది. డివిజనల్ కేంద్రమైన పాడేరు మండలంలోనే 26 పంచాయతీల్లో 16 పంచాయతీలకు రవాణా సౌకర్యం లేదు. నిష్ఫలమవుతున్న మంచినీటి పథకాలు.. మన్యంలో గిరిజనులకు తాగునీటి కొరత ప్రధాన సమస్యగా ఉంది. రక్షిత మంచినీరు గిరిజనులకు అందుబాటులో లేదు. కొండల దిగువన ఉండే గ్రామాల్లో గిరిజనులకు ఊటగెడ్డలే తాగునీటికి ఆధారంగా ఉన్నాయి. వీటి ఆధారంగానే ప్రభుత్వం గత నాలుగైదేళ్ళలో గ్రావిటీ పథకాలను నిర్మించింది. కలుషితమవుతున్న ఈ జలాల వల్ల గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న మంచినీటి పథకాలు నిష్ఫలమవుతున్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల గిరిజనులకు వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుడటం లేదు.