గిరిజనుడి హత్య
Published Fri, Feb 10 2017 12:33 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
సరివెల (చింతూరు):
మండలంలోని సరివెల గ్రామానికి చెందిన మడకం బుచ్చయ్య (36) బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పెదగుంపులో నివాసముంటున్న బుచ్చయ్యను బుధవారం రాత్రి 10 మంది వ్యక్తులు వచ్చి మాట్లాడే పనుందని తమవెంట తీసుకెళ్లారు. తెల్లవారుఝాము వరకు బుచ్చయ్య జాడ లేకపోవడంతో కుటుంబసభ్యులు సమీపంలోని పొలాల్లో వెదకగా సొంత పొలంలోనే బుచ్చయ్య మృతదేహం కనిపించింది. తలపై కర్రలతో కొట్టి, కత్తితో కడుపులో పొడిచి హత్యచేసి మృతదేహాన్ని అక్కడ పడేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
లభ్యమైన లేఖపై అనుమానం
సంఘటనా స్థలంలో మావోయిస్టుల పేరుతో ఓ లేఖ లభ్యమైంది. లేఖ అర్థవంతంగా లేకపోవడంతో వేరెవరో హత్యచేసి మావోయిస్టుల పేరుతో లేఖ పెట్టివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లభ్యమైన లేఖలో బుచ్చయ్య ఆడవాళ్లపై లైంగికదాడి చేసి హత్యచేసి జైలుకెళ్లాడని, ఈ విషయంపై సరిదిద్దుకోమని చెప్పినా వినకుండా అవే ఘటనలు పునరావృతం చేయడంతోనే అతనిని హత్యచేయాలని మా పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. లేఖపై చింతూరు సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గతంలో ఇతనిపై అనేక ఆరోపణలున్నాయని, లభ్యమైన లేఖ మావోయిస్టులది కాదని తెలిపారు. మృతదేహాన్ని చింతూరు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
Advertisement
Advertisement