కాలేజీ యజమానుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
కాలేజీ యజమానుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
Published Thu, Aug 4 2016 8:15 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
వినుకొండ రూరల్/వినుకొండ టౌన్ : ఎస్‌ఎస్‌సీ ప్రవేశాల్లో అక్రమాలకు పాల్పడుతున్న బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు మధ్యవర్తిత్వం వహిస్తూ ఏసీబీకి పట్టుబడిన వివేకానంద విద్యాసంస్థల అధినేత సయ్యద్ రఫీ కళాశాల, నివాస గృహాల్లో ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తనీఖీలు చేపట్టారు. ఈనెల 2న ఏసీబీ అధికారులు సోదాల నిమిత్తం వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రఫీ కుమారుడు రసూల్ నివాసానికి వచ్చారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం తిరిగి తనిఖీలు చేపట్టారు. సయ్యద్ రఫీ నివాస గృహం, ఎస్‌ఆర్ బీఈడీ కళాశాలలో గుంటూరు ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా, వినుకొండ బీఈడీ∙కళాశాల డైరెక్టర్ చీతిరాల రామారావు నివాసంలో హైదరాబాద్ ఏసీబీ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. రామారావు ఇంట్లో ఏవిధమైన ఆధారాలు లభించకపోవడంతో అధికారులు సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. రఫీ నిర్మించుకున్న విలాసవంతమైన నివాసం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఫస్ట్‌ఫోర్‌్లలో గదుల మొత్తాన్ని తనిఖీ చేశారు. గదుల్లోని సూట్‌కేసులను స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల్లో భారీఎత్తున నగదును ఉంటుందని అధికారులు భావించి సిబ్బందితో రెండో ఫ్లోర్‌కు తరలించి తెరచి చూడగా ఖాళీ సూట్‌కేసులు దర్శనమిచ్చాయి. రెండో ఫ్లోర్‌లోని రఫీ బెడ్‌రూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించినా ఏ ఆధారాలు లభించలేదు. ఎస్‌ఆర్ బీఈడీ కళాశాలలోని రఫీ సొంత కార్యాలయం తాళాలు తీయించి నిశితంగా పరిశీలించగా విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఎక్కడెక్కడ ఏ కళాశాలలు స్థాపించింది వాటిలో పొందుపరచినట్టు సమాచారం. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు సంబంధించిన ఆధారాలు కూడా ఎస్‌ఆర్ బీయిడీ కళాశాలలో లభించడంతో వీరి మధ్య తతంగం ఎప్పటి నుంచి సాగుతుందోనని అధికారులు కూపీ లాగేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. రాత్రి 7గంటల వరకు తనిఖీలు కొనసాగగా... మొత్తం పూర్తయిన అనంతరం వివరాలు మీడియాకు అందజేస్తామని ఏసీబీ సీఐ నరసింహారెడ్డి తెలిపారు.
ఇవేం తనిఖీలు...
సాధారణంగా ఏసీబీ అధికారులు గుట్టుగా రావడం, సోదాలు చేయడం జరుగుతుంది. కానీ, రెండురోజులు సమయమిచ్చి మరీ సోదాలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 2వ తేదీన వివేకానంద బీఈడీ ఎడ్యుకేషనల్ సోసైటీలో సోదాలు నిర్వహించటానికి ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే కుటుంబసభ్యులు అందుబాటులో లేరు, తదితర కారణాలతో ఆవరణలోనే ఉన్న రఫీ ఇంటికి, కార్యాలయానికి, రఫీ పర్సనల్ గదికి తహశీల్దార్ నాగూల్ సింగ్ సమక్షంలో పంచనామా నిర్వహించి సీల్ వేశారు. ఇదంతా మీడియా సాక్షిగా నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఏమైందో ఏమో గాని అందరి సమక్షంలో వేసిన సీళ్లను తొలగించి సిబ్బంది వచ్చినప్పుడు కబురు చేస్తే మేము వచ్చి సోదాలు నిర్వహిస్తామని ఉదారత వ్యక్తం చేయటం విమర్శలకు దారితీసింది. తీరిగ్గా కళాశాల యజమానులు వచ్చాకా, గురువారం ఏసీబీ అధికారులు కళాశాల వద్ద, ఇదే కేసులో మరొక నిందితుడిగా ఉన్న చీతిరాల రామారావుల ఇళ్లను సోదాలు చేశారు. ఈ వైనాలు చర్చకు దారితీశాయి.
అవినీతిని వెలికి తీయాలి...
మూడు దశాబ్దాల క్రితం నాలుగు అద్దెగదుల్లో ఏర్పాటు చేసిన స్కూల్ యజమాని నేడు రూ. 150 కోట్లకు పడగలెత్తటం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తం మీద 23 బీఈడీ, రెండు ఫార్మసీ కాలేజీలకు యజమానిగా రఫీ మారటం వెనక జరిగిన అవినీతిని వెలుగుతీయాలని పలువురు కోరుతున్నారు. కొందరు విద్యాశాఖాధికారులకూ రఫీ అక్రమాలలో వాటాలున్నాయనే ఆరోపణలూ వస్తున్నాయి.
Advertisement
Advertisement