
పట్టుబడ్డ అనుమానిత వ్యక్తులను చూపిస్తున్న అలిపిరి సీఐ శ్రీనివాసులు
– నేరస్తులపై ఉక్కుపాదం
– అర్ధరాత్రి నగరంలో కార్డన్ సర్చ్
– 26 మంది అనుమానాస్పద వ్యక్తులు, ముగ్గురు రౌడీ షీటర్లు, 26 ద్విచక్ర వాహనాలు, కారు స్వాధీనం
– 750 మందితో మూకుమ్మడి తనిఖీలు
తిరుపతి క్రైం : నగరంలో నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆకస్మిక తనిఖీలు, కార్డన్ సర్చ్, నాకాబందీ వంటి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నేరస్తుల భరతం పడుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం తెల్లవారుజామున 1గంట నుంచి 4 గంటల వరకు నగరంలోని జీవకోన, క్రాంతినగర్, రాజీవ్‌గాంధీ కాలనీల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు.
తనిఖీల్లో 750 మంది పోలీసులు
అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి ఆదేశాల మేరకు ఏఎస్పీ స్వామి, డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు 58, హెడ్‌కానిస్టేబుళ్లు 80, పీసీలు 400, ఆర్ముడ్ రిజర్వ్‌డ్ ఫోర్సు 100, హోంగార్డ్స్ 100 మంది ఇలా సుమారు 750 మందితో తనిఖీలు నిర్వహించారు.
ఉక్కుపాదం
ఇటీవల దేశవిదేశాల్లో నెలకొంటున్న ఉగ్రవాదులదాడులు, మరోవైపు ఇంటెలిజెన్సి వర్గం వారు తిరుమలకు ప్రమాద హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఎర్ర స్మగ్లర్లు, దొంగల భరతం పట్టేందుకే తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు చెబుతున్నారు.
కలకలం
పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, జీవకోన, క్రాంతినగర్‌లో తెల్లవారు జామున 4 గంటల వరకు జల్లెడపట్టారు. దీంతో ఆయా పాంతాల్లో కలకలం రేగింది. ఏం జరిగింది.. ఏం జరుగుతోందో తెలియక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతమంది పోలీసులను ఒకేసారి చూసేసరికి ఏదో జరిగిపోయిందన్న అపోహలు చక్కర్లు కొట్టాయి.
అదుపులో పలువురు
నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, జీవకోన, క్రాంతినగర్‌లో అనుమానిత వ్యక్తులు, దొంగల కోసం పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఇందులో 26 మంది అనుమానిత వ్యక్తులు, మరో ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన ఆధారాలులేని 28 ద్విచక్ర వాహనాలు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టి పూర్తిస్థాయిలో దొంగలను ఏరివేస్తామని అర్బన్ జిల్లా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.