ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి..
సాక్షి, హైదరాబాద్: ‘ఐఏఎస్‌లు చేసి.. ఐపీఎస్‌లు చేసి.. ముఖ్యమంత్రులై.. అవినీతి కూపాల్లో చొచ్చుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుపోయి, చంచల్‌గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పడ్డారే... వాళ్ళంతా జాతికి ముద్దుబిడ్డలు కాదు... దుష్టశక్తులు...’.. అవినీతిపై ఇంత చక్కగా లెక్చర్ దంచినవ్యక్తి ఎవరో తెలుసా? ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శనివారం అరెస్టు చేసిన కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు!! ఆయనకు రూ.13 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడులు జరగడానికి కొన్ని రోజుల ముందు కూకట్‌పల్లి పరిధిలోని ఓ కాలేజీలో ఫ్రెషర్స్‌డే జరిగింది.
ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సంజీవరావు విద్యార్థుల్ని ఉద్దేశించి.. సుదీర్ఘ ప్రసంగం చేశారు. భరతమాతకు ముద్దుబిడ్డలుగా ఉండాలని.. ఉత్తచెత్త పౌరులుగా కాక.. ఉత్తమ పౌరులుగా నిలవాలని సంజీవరావు తన ప్రసంగంలో ఉద్బోధించారు. ఈసందర్భంగా కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు అంటూ శ్రీశ్రీ కవితనూ ఉదహరించారు. ఏసీబీ దాడులు, ఆయన అరెస్టు నేపథ్యంలో సోమవారం ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.