పాదయాత్ర భక్తులకు పెచ్చెర్వులో మెరుగైన వసతులు
Published Mon, Mar 20 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 6:31 AM
శ్రీశైలం: ఉగాది ఉత్సవాలకు కర్ణాటక నుంచి పాదయాత్రగా శ్రీశైలం వస్తున్న భక్తులకు మార్గమధ్యంలో పెచ్చెర్వు వద్ద మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. పెచ్చుర్వు వద్ద భక్తులకు కల్పించే ఏర్పాట్లపై ఈఈ రామిరెడ్డి తదితరులతో కలిసి ఈఓ ఆదివారం పెచ్చెర్వును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి 30 వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో పాదయాత్రతో శ్రీశైలానికి వస్తున్నారన్నారు.
అటవీ మార్గంలో వచ్చే పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పెచ్చెర్వులో బోరుబావుల నుంచి నీటిని దామర్లకుంట ఎగువ ప్రాంత వరకు నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అందుకు తగ్గ ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భక్తులు సేద తీరేందుకు నాగలూటి, పెచ్చెర్వు తదితర చోట్ల షామియానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జనరేటర్ ద్వారా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో అన్నదానం చేసే స్వచ్ఛందం సంస్థలకు దేవస్థానం తగిన సహాయ సహకారాలను అందజేస్తుందన్నారు. కర్ణాటక నుంచి పాదయాత్రగా వస్తున్న భక్తులతో ఈఓ మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆయన వెంట శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement