నిబద్ధతకు గుర్తింపు
-
జేఎన్‌టీయూకే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ
-
అవార్డుకు ప్రసాదరాజు ఎంపిక
బాలాజీచెరువు(కాకినాడ):
జేఎన్‌టీయూకే అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జేఎన్‌టీయూకే ప్రిన్సిపాల్ గొట్టిముక్కల ప్రసాదరాజు ఎంపికయ్యారు. నిబద్ధతతో, కష్టపడి పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి తాను ఈ అవార్డుకు ఎంపికకావడం నిదర్శనమని ప్రసాదlరాజు పేర్కొన్నారు.
జీవనప్రస్థానం
పశ్చిమ గోదావరి జిల్లా ఐ. భీమవరంలో రిటైర్డ్ ఆర్‌అండ్‌బీ ఇంజనీర్ రామకృష్ణంరాజు, సత్యవతి దంపతుల మూడో కుమారుడిగా 1963లో ప్రసాదరాజు జన్మించారు. పదవ తరగతి స్వగ్రామంలో, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ భీమవరం, ఎంటెక్ ఆంధ్రా యూనివర్సిటీ, పీహెచ్‌డీ నిట్ వరంగల్‌లో చదివారు. జేఎన్‌టీయూకేలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా 1989లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి సివిల్ విభాగాధిపతిగా, జేఎన్‌టీయూకే కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్‌గా, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, రిజిస్ట్రార్‌గా సేవలందించిన ప్రసాదరాజు ప్రస్తుతం జేఎన్‌టీయూకే∙కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 2004–05, 2006–07లో అందుకున్నారు. 13 జాతీయ, 26 అంతర్జాతీయ జర్నల్స్ ప్రచురించి, 66 జాతీయ, 13 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఏపీపీజీ ఈసెట్ రెండు సార్లు దిగ్విజయంగా నిర్వహించారు.
అందరి సహకారంతో అవార్డు...
అందరి సహకారంతో ఈఅవార్డు దక్కింది. ఈ అవార్డుతో అధ్యాపక వృత్తితో పాటు కళాశాల అభివృద్ధి బాధ్యత మరింత పెరిగింది. జేఎన్‌టీయూకే ఉపకులపతి వీఎస్‌ఎస్ కుమార్, రిజిస్ట్రార్ సాయిబాబు, అధ్యాపకులు సహకారంతో కళాశాల పేరు ప్రతిష్టలు మరింత పెంచేందుకు కృషిచేస్తాను.
– డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూకే కళాశాల