మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం
మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశం
Published Tue, Aug 16 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
– ఉర్దూ యూనివర్సిటీ ప్రారంభించిన గంటా, కేఈ
– రెండేళ్లలో పక్కా భనాల్లోకి మార్చుతాం
– ఎమ్మెల్యే ఎస్వీకి కేఈ చురకలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం మైనార్టీ విద్యార్థులకు సువర్ణ అవకాశమని మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఉస్మానియా కళాశాలలో తాత్కాలికంగా మంగళవారం ఉర్దూ యూనివర్సిటీకి రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఉర్దూ వర్సిటీ కోసం తాత్కాలికంగా తరగతి గదులను కేటాయించిన ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రాజావేద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేఈ మాట్లాడుతూ.. ఉస్మానియా కళాశాలలో చదివి తాను జీవితంలో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నానని, ఉర్దూ వర్సిటీ విద్యార్థులు కూడా లక్ష్యం కోసం నిరంతరం చదివి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని సూచించారు. అంతకముందు రాజకీయ ప్రసంగం చేసిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి కేఈ చురకలంటించారు. వచ్చే ఎన్నికల్లోనూ ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో అలాంటి ప్రసంగం చేశారని.. ఆయన మరచిపోయిన మరికొన్ని పథకాలను మైనార్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు నగరంలో రూ.207 కోట్లతో అభివద్ధి పనులు జరుగుతున్నాయని, తన హయాంలోనే ఉర్దూ యూనివర్సిటీ నెలకొందని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ పేర్కొన్నారు. ఉర్దూ యూనివర్సిటీని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేసి ఇక్కడే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నట్లు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు.
నేటి నుంచి తరగతులు ప్రారంభం
ఉర్దూ యూనివర్సిటీ తరగతులను బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్‌చారి వైస్ చాన్సులర్ వై.నరసింహులు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇప్పడు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మొత్తం ఆరు కోర్సుల్లో 87 మంది చేరినట్లు చెప్పారు. ఇందులో ఎంఏ ఉర్దూ కోర్సుకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉర్దూ యూనివర్సిటీ రిజిస్ట్రార్లు సత్తార్ సాహేబ్, బి.అమర్‌నాథ్, కొడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, ఏజేసీ రామస్వామి, డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ ఆజ్రాజావేద్, పలువురు మైనార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగుకీర్తి.. విశ్వదీప్తి పుస్తకావిష్కరణ
2014 సంవత్సరంలో ఉస్మానియా కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సదస్సుకు సంబంధించిన ప్రత్యేక సంచిక తెలుగు కీర్తి..విశ్వదీప్తి అనే గ్రంథాన్ని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కేఈ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Advertisement