ఆరోగ్యమస్తు | best treatment in 'siddipet' hospitals | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమస్తు

Published Sun, Sep 18 2016 10:24 PM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

సిద్దిపేట ఏరియా ఆస్పత్రి - Sakshi

సిద్దిపేట ఏరియా ఆస్పత్రి

  • కార్పొరేట్‌కు దీటుగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రులు
  • అత్యాధునిక యంత్రాల ఏర్పాటు
  • అందుబాటులో అత్యవసర సేవలు
  • వైద్యుల పనితీరులో మార్పు
  • వైద్య సేవలపై ప్రజల సంతృప్తి
  • గవర్నర్‌తోపాటు యూనిసెఫ్‌ ప్రతినిధుల ప్రశంసలు
  • సిద్దిపేట జోన్‌: నేను రాను బిడ్డో ఈ సర్కార్‌ దవాఖానకు.. ఇది ఒకప్పటి మాట. నేనొస్త బిడ్డో ఈ సర్కార్‌ దవాఖానకు ఇది ఇప్పటి మాట. సిద్దిపేటలోని ఆసుపత్రుల్లో గణనీయమైన మార్పు రావడంతో జనం మనసు కూడా మారింది. కార్పొరేట్‌కు దీటుగా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దారు. అత్యాధునిక యంత్రాలు, వైద్యుల మెరుగైన పనితీరు, సిబ్బందిలో మార్పుతో ఇది సాధ్యపడింది. ఇక్కడి ఆసుపత్రుల ఖ్యాతి జాతీయ స్థాయికి చేరింది. మంత్రి హరీశ్‌రావు చొరవతో కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఈ ప్రాంత పేదలు అందుకుంటున్నారు.

    సిద్దిపేట ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి జిల్లాలోనే పెద్ద ఆస్పత్రులుగా పేరుగాంచాయి. మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి 300 పడకలతో సేవలందిస్తోంది. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు సమీపంలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల సరిహద్దు గ్రామాల వారు ఇక్కడ వైద్య సేవలు అందుకుంటున్నారు. ఈ లెక్కన ఈ రెండు ఆస్పత్రుల్లో రికార్డుల ప్రకారం నిత్యం దాదాపు 500 ఓపీ కేసులు నమోదవుతున్నాయి.

    కంగారు యూనిట్‌, హైరిస్క్‌ కేంద్రాలు
    దేశానికే ఆదర్శంగా నిలిచే కంగారు యూనిట్‌తోపాటు జిల్లాలో తొలి ప్రయోగంగా హైరిస్క్‌ కేంద్రాన్ని సిద్దిపేటలోనే ఏర్పాటు చేశారు. శిశు మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రం, కంగారు మెథడ్‌ యూనిట్‌తోపాటు గర్భిణులకు హైరిస్క్‌ కేంద్రంలో అత్యవసర వైద్య సేవలందుతున్నాయి.

    ఆధునిక యంత్రాలు ఇలా...
    ఏరియా ఆస్పత్రిలో ఇటీవలే కోటి రూపాయలతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా వెంటిలేటర్‌, ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, సెంట్రల్‌ ఆక్సిజన్‌తోపాటు అత్యాధునిక రక్త నిల్వల పరికరాలు, డెంగీ నిర్ధారణకు ప్లేట్‌లెట్‌ కౌంటింగ్‌ మిషన్‌ వంటివి ఏర్పాటయ్యాయి.

    ఐసీయూ యూనిట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పాము, తేలు కాటు బాధితులకు, పురుగుల మందు తాగిన వారికి, రోడ్డు ప్రమాదంలో పరిస్థితి విషమంగా ఉన్నవారికి రిఫరెన్స్‌ లేకుండానే సేవలందిస్తున్నారు. ఫలితంగా అత్యవసర వైద్య పరీక్షల కోసం ప్రైవేట్‌ సంస్థలు లేక హైదరాబాద్‌, కరీంనగర్‌ వంటి పెద్ద పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బాధితులు, రోగులు ఇక్కడే వైద్య సేవలందుకుంటున్నారు.

    మూడు జిల్లాల వాసులకు సేవలు
    మూడు జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలకు నిత్యం వైద్యసేవలను అందించే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు కార్పొరేట్‌ స్థాయి వసతులను కల్పించడంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఏరియా ఆస్పత్రి, మాతాశిశు సంక్షేమ కేంద్రాల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.

    సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో​ఏర్పాటుచేసిన ఐసీయూ యూనిట్‌, ప్లేట్‌లెట్‌ సపరేటర్‌, సీటీ స్కాన్‌, ఎంసీహెచ్‌లో ఏర్పాటుచేసిన కంగారు మెథడ్‌ యూనిట్‌, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, హైరిస్క్‌ సెంటర్లు పేదలకు సముచిత సేవలందిస్తున్నాయి.

    పలువురి మన్ననలు
    సిద్దిపేట ఎంసీహెచ్‌ను ఇటీవల గవర్నర్‌ నరసింహన్‌ సందర్శించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీకి చెందిన ప్రతినిధులు, యూనిసెఫ్‌ సభ్యులు పలు దఫాలుగా సిద్దిపేట ఆస్పత్రిలో వైద్యసేవలు, సదుపాయాలను కొనియాడారు. అయితే సిబ్బంది మరింత మెరుగ్గా సేవలందించాలని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

    పారదర్శకతకు పెద్దపీట
    జవాబుదారితనంతో పాటు సేవల్లో పారదర్శకత, ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సిద్దిపేట ఆస్పత్రుల్లో ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది సేవలపై అభ్యంతరాలు, ఫిర్యాదులు తమ పేరు లేకుండానే బాధితులు ఆ బాక్స్‌లో వేయవచ్చు. సిద్దిపేట ఆర్డీఓ పర్యవేక్షణలో 15 రోజులకోసారి ఈ బాక్సులను తెరుస్తారు. వచ్చిన ఫిర్యాదులను మంత్రి హరీశ్‌రావుకు అందజేస్తారు.

    మరోవైపు ఎంసీహెచ్‌లోని కంగారు మెథడ్‌, నవజాత శిశుసంరక్షణ, హైరిస్క్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి వాటిని మంత్రి హరీశ్‌రావు తన సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేసుకున్నారు. తద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేగాక ప్రతినెలా ఆకస్మిక తనిఖీల ద్వారా ఆస్పత్రుల్లో అవినీతి, సిబ్బంది నిర్లక్ష్యం, మౌలిక వసతులపై మంత్రి నేరుగా రోగులతో మాట్లాడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement