సిందూర శోభితం
భవానీ భక్తులతోఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భవానీ దీక్షలు స్వీకరించిన వారి సంఖ్య ఈ ఏడాది రెట్టింపైంది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : భవానీ భక్తులతోఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని భవానీ దీక్షలు స్వీకరించిన వారి సంఖ్య ఈ ఏడాది రెట్టింపైంది. శనివారం నుంచి సోమవారం వరకూ మూడు రోజుల్లో సుమారు 30వేలకు పైగా భవానీ భక్తులు దీక్ష విరమించారు. భవానీల రద్దీ మంగళ, బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దుర్గమ్మను రికార్డు స్థాయిలో భవానీలు దర్శించుకున్నారనేందుకు లడ్డూ విక్రయాలే ఉదాహరణ. తూర్పు, పశ్చిమ గోదావరితో పాటు విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు వచ్చారు. నగరానికి చేరుకున్న భవానీలు కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి క్యూలైన్‌లో కొండపైకి చేరుకుంటున్నారు. దర్శనానంతరం ఇరుముళ్లను ఎక్కడ సమర్పించాలి, దీక్షలను ఎక్కడ విరమించాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కనకదుర్గానగర్‌లో ఏర్పాటుచేసిన హోమగుండం వద్ద మాలలను తీసేందుకు గురుభవానీలు లేకపోవడంతో భవానీలు ఇబ్బందులకు గురయ్యారు.