
‘భూమా’ గతంలో ఏమన్నారు..!
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడుకు దూకుడుగా వెళ్లినపుడు మేం నచ్చుతాం. అపుడు ఆయన మమ్మల్ని ఉపయోగించుకున్నారు. టీడీపీలో ఉన్నపుడు మాకు అవమానం జరిగితే చంద్రబాబు ముందే ఏడ్చాను. అయినా పట్టించుకోలేదు. ఆయనకు ఓదార్చటం కూడా రాదు. ఓదార్చటం అలవాటు ఉందో లేదో కూడా తెలియదు. పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేసినా దగ్గరకు తీసుకోలేదు. ప్రతిదానికీ రాజకీయమే. పార్టీలో మేం సిన్సియర్‌గా పనిచేస్తేనే ఆ పాటి గౌరవం దక్కింది. ఇతర పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వస్తే ఏ పాటి గౌరవం ఉంటుందో మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి.
ఫిరాయింపులపై గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు వ్యాఖ్యలు
సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలి. మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్లు, ఇది న్యాయమా? టీడీపీలో గెలిచి రాజీనామా చేయకుండా హీరో మాదిరిగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే.. అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లూ? ఇది న్యాయమా? ఇలాంటి సమయంలో అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్థంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉంది.