గోదావరి.. గట్టెక్కాలి | big reservoir in gattu lingampalli | Sakshi
Sakshi News home page

గోదావరి.. గట్టెక్కాలి

Published Fri, Feb 19 2016 4:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

గోదావరి.. గట్టెక్కాలి

గోదావరి.. గట్టెక్కాలి

గట్టులింగంపల్లిలో భారీ రిజర్వాయర్!
ఖేడ్‌కు  వరప్రదాయిని..
కార్యరూపం  దిశగా అడుగులు
77 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం
కేసీఆర్ హామీపై  కోటి ఆశలు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ ఉప సంగ్రామం ముగిసింది. ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన వ్యక్తే విజయం సాధించారు. ఇప్పుడిక నాటి ఎన్నికల ప్రచారసభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘హామీ’యే సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ‘గోదావరి జలాలు తెచ్చి ‘ఖేడ్’ ప్రజల కాళ్లు కడుగుతా.. తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తా’ అని కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆసక్తి నెలకొంది. ఖేడ్ నియోజకవర్గాన్ని ఏళ్లకేళ్లుగా దుర్భిక్షం పట్టిపీడిస్తోంది. సీఎం ప్రకటనతోనైనా తాగు, సాగునీటి కష్టాలు తీరుతాయని ఇక్కడి ప్రజలు ఆశ పెట్టుకున్నారు. నీళ్ల కోసం ఇక్కడి జనం బాధలు అన్నీ ఇన్నీకావు.. చిన్నారులు సైతం బడి మానేసి నీటి బాట పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు కాసినా మూడు బిందెలు కూడా దొరకని దుస్థితి. ఇలాంటి ఖేడ్ నియోజకవర్గానికి అపర సంజీవినిగా మారబోతున్నది ‘గట్టులింగంపల్లి’..

 గట్టులింగంపల్లి పెద్ద రిజర్వాయర్‌గా రూపుదిద్దుకోబోతోంది. నారాయణఖేడ్‌కు వర ప్రదాయినిగా మారబోతోంది. అంతా అనుకున్నట్టుగా సాగితే మంజీర నదిపై నిజాం రాజులు కట్టిన ఘణపురం ఆనకట్ట కంటేగట్టు లింగంపల్లి రిజర్వాయర్ పెద్దదిగా అవతరించనున్నది. మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లో దాదాపు 77 వేల ఎకరాలను సాగు నీరు అందించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనికి కేంద్ర పాలక సంస్థ ‘వ్యాస్కోప్’ డిజైన్ రూపొందించే పనిలో పడింది. 

ఇదే ప్రణాళిక....
సింగూరు ప్రాజెక్టు బ్యాక్ జలాలు మనూరు మండలానికి తాకుతాయి. ఈ జలాలు సముద్ర మాట్టానికి 517 నుంచి 520  మీటర్ల ఎత్తులో ఉంటాయి.  మంజీరకు కేవలం 1.5 కిలో మీటర్ల దూరంలోనే గట్టు లింగంపల్లి ఉంది. నాలుగు దిక్కులా కొండలు కలిగి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. తూర్పునకు బుడ్డగట్టు, మడగట్టు, పడమరకు రానాపురం గట్టు ,దక్షిణం వైపునకు దూద్‌గొండ, ఉత్తరం దిక్కున ఊరగట్టులున్నాయి.  ఈ కొండల నడుమ విశాలమైన  లోతట్టు ప్రాంతం ఉంది.  లింగంపల్లి ఊరు వైపున్న బుడ్డగట్టు, మడగట్టు నుంచి  ఊరగట్టు వరకు ఆనకట్ట నిర్మించి, లోతట్టు ప్రాంతాన్ని రిజర్వాయర్‌గా చేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు. దీనికి దక్షిణం వైపు అంటే దూద్‌గొండ వెనుక  మంజీరా నది ప్రవహిస్తుంది. దూద్‌గట్ట్టును తవ్వి కాల్వ చేస్తే సింగూరు జలాలు పల్లానికి చేరి రిజర్వాయర్ నిండే విధంగా డిజైనింగ్ రూపొందించారు.

ఈ రిజర్వాయర్‌లో నీటి నిల్వ సామర్థ్యం 0.5 టీఎంసీ నుంచి  ఒక టీఎంసీ వరకు ఉంటుందని అంచనా..  గట్టు లింగంపల్లి  రిజర్వాయర్‌ను మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాలలోని చెరువులకు కాల్వల ద్వారా అనుసంధానం చేస్తారు. వీలును బట్టి మధ్య మధ్యలో చెక్ డ్యాంల నిర్మాణం చేసి వాటి సాధ్యమైనంత ఎక్కువ విస్తీర్ణంలో  సాగుకు నీళ్లు అందిస్తారు.  నారాయణఖేడ్ మండలంలో రుద్రార్, లింగాపూర్, మద్వార్,హన్మంతరావు పేటమత్తడి, నిజాంపేటలోని మదిరాల చెరువు నిండిన తరువాత మిగులు జలాలు నిజాంసాగర్‌లో కలుస్తాయి. మనూరు మండలం కారముంగి వద్ద ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు చేసి దాదాపు 12 గ్రామాలకు సాగు నీరు అందిస్తారు. మరో వైపు ప్రాణహిత చేవెళ్ల నుంచి పెద్దశంకరంపేట మండలంలో దాదాపు 17 వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా ప్రణాళిక చేసిన విషయం తెలిసిందే.

 రైతు రాజే..
ప్రస్తుతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో 55 వేల హెక్టార్లలో సాగు భూమి ఉంది. చెరువులు, కుంటలు, వాగులు  ద్వారా కేవలం 16 వేల ఎకరాలు మాత్రమే సాగు నీరు అందుతుంది. మనూరు మండలంలో రాతినేలలు, గులక రాళ్లు భూములు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాల్లో ఎర్ర నేలలు, నల్లమట్టి నేలలు ఉన్నాయి. నీళ్లుంటే ఈ భూముల్లో వాణిజ్య పంటల నాణ్యమైన విత్తనాలు పండుతాయి. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పసుపు,అల్లం పంటలు విస్తారంగా పండేందుకు అవకాశం ఉన్న భూములు. ఇప్పటికీ ఇక్కడి రైతులు ఉల్లి, వెల్లుల్లి, శనగ, చెరకు పంటలు పండిస్తున్నారు. కానీ సాగు నీరు లేక 20, 30 ఎకరాలు ఉన్న రైతులు కూడా వలస కూలీలుగానే కాలం గడుపుతున్నారు. పట్టణాలకు వలసపోయి పిల్లలను చదివించుకుంటున్నారు. గట్టు లింగంపల్లి రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతంలో బంగారమే పండుతుంది.

 గట్టులింగంపల్లికి బీజంపడింది ఇలా..
కొద్ది రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు మనూరు మండలానికి వచ్చినప్పుడు స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ సందర్భంలోనే ఈ ప్రాంతానికి ఒక జల ప్రాజెక్టు కావాలని విలేకరులు మంత్రి దృష్టికి తెచ్చారు. ‘మీ ఆశ.. ఆశయం గొప్పది.. కానీ రాళ్లు తేలిన మనూరు మండలానికి ప్రాజెక్టు సాధ్యమయ్యే పనేనా’ అంటూ మంత్రి ఆలోచనలో పడ్డారు. సరిగ్గా అప్పుడే ‘సాక్షి’ మనూరు విలేకరి.. గట్టులింగంపల్లి ‘గుట్టు’ చెప్పారు. అంతే మంత్రి మోములో ఆనందం.. ‘మీరు చెప్పేది నిజమైతే తపస్సు చేసైనా ముఖ్యమంత్రిని ఒప్పిస్తా’ అని మాటిచ్చారు.  వెంటనే సెల్‌ఫోన్‌లోనే నీటిపారుదల శాఖ ఇంజనీర్లను ఏకం చేశారు.  ‘చలో పోదం పదా.. గట్టు లింగంపల్లికి’అంటూ  పయనమయ్యారు. ఇది గత సెప్టెంబ ర్‌లో జరిగిన సంఘటన. ఆ వెంటనే ఆయన సీఎం చేత ఏకంగా ప్రకటన చేయించారు. ఇప్పడది కార్యరూపం దాల్చబోతున్నది.

 గట్టు లింగంపల్లి ఒక పరిష్కారం
గట్టు లింగంపల్లి సహజసిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. 60 ఏళ్ల నుంచి పాలిస్తున్న నాయకులు దీని గురించి ఎందుకు ఆలోచన చేయలేదో నాకు  అర్థం కావటం లేదు. నారాయణఖేడ్ ప్రాంతానికి అత్యవసరంగా సాగు, తాగు నీళ్లు అవసరం. దీనికి గట్టు లింగంపల్లి రిజర్వాయర్ ఒక పరిష్కారం చూపెడుతుంది. దీని డిజైనింగ్ ప్రస్తుతం ‘వ్యాస్కోప్’ రూపొందిస్తోంది. మనూరు, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలాలకు కనీసం 77 వేల ఎకరాల్లో సాగు నీరు అందిస్తుందని అంచనా వేస్తున్నాం.  నిజానికి ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణం సాగులోకి తెచ్చే ప్రయత్నం. ఈ రిజర్వాయర్ ద్వారా గొలుసుకట్టు చెరువును నింపుకుంటూ వెళ్తే సాధ్యమైనన్ని ఎక్కువ గ్రామాలకు నీళ్లు అందుతాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు. -  భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

చెరువు నీళ్లు అడిగితే తలలు పగులగొట్టిండ్రు
గట్టు లింగంపల్లి చెరువు కట్ట వేస్తేనే ఓటేస్తం అని చెప్పినందుకు  జనాన్ని తీసుకొచ్చి ఊరుమీదపడి తలలు పగలగొట్టిండ్రు. పోలీసులకు చెప్పి కేసులు పెట్టిండ్రు. మక్కెలు ఇరుగ తన్నిచ్చిండ్రు. ఇక అప్పటి నుంచి చెరువు మాటే ఎత్తలే.  -గొట్టం రాములు పగిడిపల్లి

కరువు తీరుద్ది
రెండు దినాలు పోతే జీవాలకు కూడా నీళ్లు దొరకవు. దెబ్బలకు బయపడి సెరువు అడుగుడు సార్ధారిచ్చుకున్నాం.. హరీశ్ వచ్చి తలాబ్ కట్టిత్తం అన్నడు. ఊరగట్టు నుంచి బుడ్డ గట్టు దాక కట్టిస్తా అంటుండు...సూడాలే ఎట్టయిద్దో.. తలాబ్ కడితే  కరువు దీరుద్ది.  
 - నర్సుగొండ, పగిడిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement