
అయ్య బాబోయ్
⇒ జిల్లాలో చెలరేగిపోతున్న ‘బిగ్‌బాస్’
⇒ ‘చినబాబు’ ఆశీస్సులే వెన్ను దన్ను
⇒ తీవ్ర వేధింపులతో అధికారులు బెంబేలు
⇒ జిల్లాలో ఉద్యోగమంటేనే గుండె గుభేల్
⇒ బడా బాబులతో మిలాఖత్
⇒ దేవాలయాల కూల్చివేత సూత్రధారి
ఆయన జిల్లా బిగ్‌బాస్.. అధికార టీడీపీ ‘చినబాబు’ ఆశీస్సులతో జిల్లాలో 2015లో బాధ్యతలు స్వీకరించారు. రాజధాని ప్రాంతంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం చినబాబు ఆయన్ను జిల్లాలో నియమించుకున్నారు. ఇంకేముందీ!. ఆ ఉన్నతాధికారి
అడ్డగోలు అవినీతికి అడ్డే లేకుండాపోతోంది.
జిల్లాలో అధికార యంత్రాంగాన్ని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న బిగ్‌బాస్ వైఖరితో ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆయన తన అనుకూల అధికారులతో ఓ కోటరీ ఏర్పాటు చేసుకుని మరీ చెలరేగిపోతున్నారు. ఆయనకు మామూళ్లు ఇచ్చుకోలేక కొందరు, ఆయన చెప్పినట్లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేక మరికొందరు మనో వేదనకు గురవుతున్నారు. సత్తా ఉన్న వాళ్లు జిల్లా వదిలిపోతుండగా, ఆ పని చేయలేని ఉద్యోగులు దినమొక గండంగా నెట్టుకొస్తున్నారు. జిల్లా చరిత్రలో ఇంతటి వివాదాస్పద ఉన్నతాధికారిని తాము చూడలేదని ఉద్యోగ వర్గాలు గగ్గోలు పెడుతున్న ఆయన వైఖరికి కొన్ని మచ్చుతునకలు ఇవిగో...
వేధింపులే..వేధింపులు
► 2015లో హౌసింగ్ పీడీగా పనిచేస్తున్న సీహెచ్ ప్రతాపరావుపై జిల్లా ఉన్నతాధికారి తన ప్రతాపం చూపించారు. దాంతో పీడీకి గుండెపోటు వచ్చింది. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. కొన్ని నెలలపాటు ఆయన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
► 2015లో అప్పటి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎ. కృష్ణారావు జిల్లా ఉన్నతాధికారి వేధింపులు తాళలేక రెండునెలలపాటు సెలవుపై వెళ్లిపోయారు.
► జాయింట్ కలెక్టర్–2గా ఉన్న ఒంగోలు శేషయ్యను ఆయన వయసు చూసైనాసరే జిల్లా ఉన్నతాధికారి కనీసం గౌరవం ఇవ్వలేదు. తీవ్రంగా వేధించడంతో ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాల్సి వచ్చింది.
► 2016లో వ్యవసాయశాఖ జేడీగా ఉన్న వి. నరసింహారావుపై జిల్లా ఉన్నతాధికారి తరచూ విరుచుకుపడేవారు. దాంతో ఆయన మనస్తాపానికిగురై బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.
► ఇటీవల డ్వామా పీడీ మాధవీలత ఉన్నతాధికారి ఒత్తిళ్లు భరించలేక మాతృశాఖ అయిన బీసీ సంక్షేమ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు.
► జిల్లా ఆడిట్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కృష్ణమోహన్‌ను గత ఏడాది ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారిగా ప్రభుత్వం నియమించింది. కానీ ఉన్నతాధికారి ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా రెండు నెలలు తిప్పించుకున్నారు. అలా చేస్తే ‘మామూళ్ల’ విషయం తేలుస్తారని ఉన్నతాధికారి భావించినట్లు స్పష్టమవుతోంది. చేసేది లేక ఆయన ఆడిట్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
► పట్టిసీమ పనుల సందర్భంగా వివిధ శాఖల అధికారుల్ని అర్ధరాత్రి వరకు పనులు చేయమని జిల్లా ఉన్నతా«ధికారి తీవ్ర ఒత్తిడి చేశారు. రెవెన్యూ ఉద్యోగులను అసభ్యంగా దూషించడంతో వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
► ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు సంబంధించి కాంప్రహెన్సివ్ పెన్షన్ మేనేజ్‌మెంట్ విధానంపై కూడా జిల్లా ఉన్నతాధికారి ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు.
► జిల్లా ట్రెజరీలో ఉద్యోగులకు ఐడీ కేటాయింపు 15 రోజుల్లో పూర్తి కావాలని డెడ్‌లైన్ విధించారు. ఆ ప్రక్రియ అంత త్వరగా జరగదని చెప్పినా వినిపించుకోకుండా ఏకంగా ఉద్యోగుల జీతాలను నిలుపుదల చేయించారు. దీంతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.
క్వారీ అనుమతుల్లో రూ. కోట్ల మామూళ్లు ..!
పుష్కర పనుల ముసుగులో జిల్లా ఉన్నతాధికారి యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. విజయవాడ శివారులోని క్వారీలకు ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారు. ఘాట్ పనులు త్వరగా చేయాలనే నెపంతో కొందరు బినామీ కాంట్రాక్టర్లతో క్వారీలను కొల్లగొట్టారు. దాదాపు రెండు నెలలపాటు క్వారీలను గుల్ల చేసి కోట్ల రూపాయలను జేబులో వేసుకున్నారని గనుల శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
దేవాలయాల కూల్చివేత సూత్రధారి ..
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పుష్కరాల సందర్భంగా జిల్లా ఉన్నతాధికారి హిందువుల మనో భావాలను తీవ్రంగా దెబ్బతీశారు. విజయవాడలో దాదాపు 60 దేవాలయాలను దగ్గరుండి మరీ కూల్చివేయించారు. భక్తులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపినప్పటికీ జిల్లా ఉన్నతాధికారి ఏమాత్రం వెనక్కితగ్గకుండా దేవుళ్ల విగ్రహాలపట్ల కూడా మహాపరాధం చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
బడాబాబులకు పెద్దపీట... పేద వ్యాపారులపై ప్రతాపం ...
విజయవాడలో ఫుడ్‌కోర్టు వివాదానికి జిల్లా ఉన్నతాధికారే ప్రధాన కారణం. ఆయన నగరం లోని కొన్ని పెద్ద రెస్టారెంట్ల యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారు. బడాబాబుల వ్యాపార ప్రయోజనాల కోసం ఫుడ్‌కోర్టులను తొలగించాలని ఆయన ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ ఫుడ్‌కోర్టులను అర్ధరాత్రి బలవంతంగా తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వీరపాండియన్ ఏకంగా తినుబండారాల్లో ఫినాయిల్ పోయడం వివాదాస్పదమైంది. వ్యాపారులు తీవ్ర ఆందోళన చేయడంతో తాత్కాలికంగా వెనక్కితగ్గారు.