మందమర్రి రూరల్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం పల్లంగూడ గ్రామానికి చెందిన బాలికను గర్భవతిని చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఈ ఘటనలో బాలిక శీలానికి వెలకట్టిన 20 మంది పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేశారు.
పల్లంగూడకు చెందిన బాలిక(15)ను పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ చిర్రకుంట మహేందర్, అతడి మిత్రులు అటుకపురపు విజయ్‌కుమార్, తాల్లపల్లి సంతోశ్, నీతుల ప్రశాంత్, మహేందర్ లు ఏడాదిన్నరగా లైంగిక వేధిస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించగా.. నిందితులకు రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఇందుకు అంగీకరించని బాలిక తల్లిదండ్రులు ఈ నెల 5న దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ సదయ్య నిందితులను అరెస్టు చేశారు. పంచాయితీలో తీర్పు చెప్పిన 20 మంది పెద్దలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు, విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు 20 మంది గ్రామ పెద్దలపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అయిదుగురు నిందితులపై నిర్భయ చట్టం, అత్యాచార కేసుతోపాటు బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.