కృష్ణానగర్‌లో దొంగలు కొల్లగొట్టిన ఇళ్లు
జిల్లాలో బీహార్ దొంగల ముఠా
Published Mon, Nov 28 2016 9:19 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళితే.. అంతే సంగతులు
– కర్నూలులో ఐదు ఇళ్లలో దోపిడీ
– భారీ మొత్తంలో నగదు, నగలు లూఠీ
– పోలీసులకు సవాల్‌గా మారిన వరుస చోరీలు
కర్నూలు: జిల్లాలో బీహార్ దొంగల ముఠా తిష్ట వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. ఏళ్ల తరబడి కష్టించి దాచిపెట్టుకున్న నగదు, నగలను క్షణాల్లో లూఠీ చేస్తున్నారు. కర్నూలు నగరంలో ఒకే రోజు ఐదు ఇళ్లలో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను ఎంపిక చేసుకొని రాత్రి తమ చేతి వాటం ప్రదర్శించి అందినమటుకు దండుకొని ఉడాయించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థలో డైరెక్టర్‌గా పని చేస్తున్న బ్రహ్మానందరెడ్డి కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నాడు. శ్రీశైలంలో జరుగుతన్న నృత్య పోటీల్లో కూతురు పాల్గొనాల్సి ఉన్నందున కుటుంబ సభ్యులు ఇంటికి తాâ¶ళం వేసి శ్రీశైలం వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తలుపునకు వేసిన తాళాలు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను బద్దలుకొట్టారు. పడకగదిలో ఉన్న బీరువాలో 20 తులాల బంగారు నగలు, రూ.30వేల నగదు మూటగట్టుకొని ఉడాయించారు. వంట రూములో కూడా సామాన్లన్నీ చిందరవందరగా పడేశారు. పక్కింట్లో ఇంటి యజమానులు నిద్రిస్తుండగా, బయట వాళ్ల ఇంటి తలుపులు గడియ బిగించి బ్రహ్మానందరెడ్డి ఇంటిలో లూఠీ చేశారు. ఇంటి యజమాని భువనేశ్వరి సోమవారం ఉదయం నిద్రలేచి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా గడియ బిగించి ఉండటంతో కిటికిలోంచి పక్కింటి తలుపులను గమనించింది. తెరిచి ఉండటంతో బ్రహ్మానందరెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వెంటనే వారు కర్నూలుకు చేరుకొని నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలో అదే కాలనీలోని శ్రీనివాస మందిరం లైనులో నివాసం ఉంటున్న వాసుదేవరావు ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లారు. దొంగలు ఆ ఇంటి తాళాలు కూడా బద్దలుకొట్టి బీరువాలో ఉన్న అరకిలో వెండి, ఒక నెక్లెస్, ఒక ఉంగరం చోరీ చేశారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు నాల్గవ పట్టణ సీఐ నాగరాజరావు, ఆయా ఇళ్ల వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. వేలి ముద్ర నిపుణులను రప్పించి ఆధారాలను సేకరించారు.
మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లల్లో...
మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు కాలనీల్లో దొంగలు స్వైరవిహారం చేశారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని దోపిడీకి పాల్పడ్డారు. రీజినల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మోహన్ మాధవినగర్‌లోని అమ్మ హాస్పిటల్ వెనుక నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో శనివారం కసాపురం వెళ్లారు. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు అందుబాటులో ఉండటంతో వాటి ఆధారంగా చోరీకి పాల్పడ్డారు. సామాన్లన్నీ చిందరవందర చేసి లాకర్‌లో ఉన్న 10 తులాల బంగారు, నగదును మూటగట్టుకొని ఉడాయించారు. అలాగే గణేష్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఇనాయతుల్ల ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో నందికొట్కూరు వెళ్లారు. దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న బంగారు నగలు, కొంత నగదు చోరీ చేశారు. అదే కాలనీలో నివాసం ఉంటున్న సునీల్ కుటుంబ సభ్యులతో వేరే ఊరికెళ్లారు. దొంగలు ఇంట్లోకి ప్రవేశించి రూ.10 వేల నగదు, వెండి పట్టీలు మూటగట్టుకొని ఉడాయించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నేరం జరిగిన తీరును పరిశీలించారు.
జిల్లాలో బీహార్ దొంగల ముఠా
కడప, అనంతపురం జిల్లాల్లో కూడా గత రెండు రోజులుగా వరుసగా చోరీలు చోటు చేసుకున్నట్లు పోలీసు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కర్నూలు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగల ముఠా జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. బీహార్ దొంగల ముఠా జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.
ఊళ్లకు వెళితే పోలీసులకు సమాచారం ఇవ్వండి
ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లే వారు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే పోలీసు నిఘా ఏర్పాటు చేస్తాం. ఖరీదైన నగలు, నగదు ఇళ్లలో కాకుండా బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంట్లో డబ్బులు, విలువైన సొమ్మును పెట్టుకోవద్దని కాలనీల్లో చైతన్య సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. వరుస చోరీల నేపథ్యంలో ముగ్గురు ఎస్‌ఐలతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. కాలనీల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు కానీ, డయల్ 100కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలి.
– డీఎస్పీ రమణమూర్తి
Advertisement
Advertisement