సమ్మెతో ప్రభుత్వాలకు గుణపాఠం
-
బైక్ ర్యాలీలో కేంద్ర కార్మికసంఘాల పిలుపు
కాకినాడ సిటీ :
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెను కార్మికవర్గం జయప్రదం చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సాయంత్రం సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏఐసీసీటీయూ తదితర కేంద్ర కార్మిక సంఘాలు జేఎన్‌టీయూ నుంచి బైక్‌ర్యాలీ చేపట్టి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని కోరాయి. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ వంటి కార్మిక చట్టాలు అమలు చేయాలనే డిమాండ్లతో సమ్మె జరుగుతోందన్నారు. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా జేఏసీ మాజీ చైర్మన్ ఆచంటరామారాయుడు, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు సీహెచ్.అజయ్‌కుమార్, తోకల ప్రసాద్ పాల్గొన్నారు.
ఏఐటీయూసీ ప్రచారం
వివిధ పరిశ్రమల గేట్‌ల ముందు కార్మికుల కూడలిలో ఏఐటీయుసీ సమ్మె విజయవంతం కోరుతూ ప్రచారం నిర్వహించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యదర్శి జుత్తుక కుమార్, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి నక్క కిషోర్ పాల్గొన్నారు.