వృత్తి మెకానిక్‌... ప్రవృత్తి చోరీలు | bike theef arrest | Sakshi
Sakshi News home page

వృత్తి మెకానిక్‌... ప్రవృత్తి చోరీలు

Published Sat, Oct 1 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

వృత్తి మెకానిక్‌... ప్రవృత్తి చోరీలు

వృత్తి మెకానిక్‌... ప్రవృత్తి చోరీలు

– బైక్‌ల దొంగ అరెస్ట్‌
– 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
   
కర్నూలు: మెకానిక్‌ షెడ్‌లో గుమాస్తాగా పనిచేస్తూ జల్సాల కోసం బైకుల చోరీకి పాల్పడిన దొంగ పోలీసుల వలకు చిక్కాడు. మహానంది మండలం అభాండం తండాకు చెందిన మెగావత్‌ నాగార్జున నాయక్‌ నంద్యాల పట్టణంలో మెకానిక్‌ షెడ్‌లో గుమాస్తాగా పనిచేస్తూ మారు తాళాలతో బైకులను చోరీ చేశాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నంద్యాల ఒకటవ పట్టణ పోలీసులు నిందితుడు నాగార్జున నాయక్‌పై నిఘా వేసి పట్టుకుని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నంద్యాల–మహానంది రోడ్డులోని బంగారుపుట్ట వద్ద నాగార్జున నాయక్‌ అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా బయటపడింది. నంద్యాల, కడప పట్టణాల్లో బైక్‌లు చోరీ చేసినట్లు ఆయా పోలీస్‌స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. నాగార్జున నాయక్‌ వినియోగిస్తున్న ఒక బైకును గుర్తించి విచారించగా సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ వద్ద కంప చెట్లలో మరో 8 బైకులు దాచి వుంచినట్లు అంగీకరించడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బైకు దొంగను అరెస్టు చేసి ద్విచక్ర వాహనాలను రికవరీ చేసినందుకు నంద్యాల ఒకటవ పట్టణ సీఐ ప్రతాప్‌రెడ్డి, ఎస్‌ఐలు రమణ, హరిప్రసాద్, హెడ్‌ కానిస్టేబుల్‌ సుబ్బరాజు, శివయ్య, బాలదాసు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, గంగాధర్, మద్దిలేటి, రమేష్‌ తదితరులను ఎస్పీ అభినందించారు. 
 
గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగిస్తే పోలీసు చర్యలు: ఎస్పీ 
 గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే వారు ఎంతటివారైనా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. పాణ్యం సమీపంలోని కొండజూటూరు, వెల్దుర్తి మండలం చెరుకులపాడుతో పాటు ఆదోని ప్రాంతాల్లోని మరో రెండు గ్రామాల్లో కొంతమంది ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వారికి సూచించారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేవారిపై రౌడీషీట్లు, బైండోవర్‌ కేసులు నమోదు చేయాలని స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఎక్కడైనా ఎవరైనా రౌడీయిజానికి, దౌర్జన్యానికి పాల్పడితే తక్షణమే డయల్‌ 100 లేదా స్థానిక  పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement