ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలి
-
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి
నెల్లూరు(బారకాసు):కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్‌ను సర్వతోముఖాభివృద్ధిలో నడిపించేందుకు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి ప్రకటించిడం సంతోషకరమన్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడిన జాతీయ సంస్థలు రెండు మినహా అన్నింటినీ మంజూరు చేసిందన్నారు. మిగిలిన రెండు సంస్థలను పార్లమెంట్ చట్టం ద్వారా త్వరలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న అడ్డంకులు తొలగించడానికి కేంద్రం మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో చర్యలు తీసుకుందని చెప్పారు. 2014నుంచి ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు కేంద్రమే భరించనుందన్నారు. 2015 నుంచి 2020 వరకు రాష్ట్రానికి కలిగే రెవెన్యూ లోటును 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు లోబడి రూ.22వేలకోట్ల సహాయాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తుందన్నారు. ఇలా అన్ని విధాలా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంటే ప్రతిపక్షనేతలు మాత్రం ఏమీ చేయడం లేదని ఆరోణలు చేస్తున్నారన్నారు. ఇందుకోసం ఈనెల 20వ తేదీన పార్టీజిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలో పాల్గొనేందుకు ఆన్‌లైన్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు రాజేష్, ఈశ్వరయ్య, సుధాకర్‌రెడ్డి, గిరిగౌడ్, బండారు శ్రీనివాసులు, కాయల మధు, నరసింహులునాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.