తిరంగా.. ఘనంగా..
పి.గన్నవరం : ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడిన మహనీయులను ఎల్లవేళలా స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభొట్ల సుధీష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యాజీ వేమా అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యాన పి.గన్నవరంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. 700 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని మెయిన్ రోడ్డులో ఊరేగించారు. తొలుత అక్విడెక్టు వద్ద పి.గన్నవరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు అడ్డగళ్ల అచ్యుతరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి పోలీస్ స్టేషన్ వరకూ ఆయన ఫ్లెక్సీతో పాటు, జాతీయ పతాకాన్ని ఊరేగించారు. సిద్ధార్థ కళాశాల విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతబట్టి ‘భారత్‌మాతాకీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. మూడు రోడ్ల సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు సీతారామయ్య కుమారుడు అడ్డగళ్ళ నారాయణమూర్తిని నాయకులు అభినందించారు. బీజేపీ మండల అధ్యక్షుడు వులిశెట్టి గంగాధర్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమాల్లో ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకూరి గోపాలకృష్ణ, బెల్లంపూడి సర్పంచ్ చీకరమెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.