బీజేపీ లోగో
– రాయలసీమ జిల్లాల నేతలందరూ హాజరు
– ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
– సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధిష్టానం
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
అక్టోబరు 1న తిరుపతిలో భారీ సదస్సును నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నేతలను కూడా సదస్సుకు ఆహ్వానించనుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రయోజనాలను ప్రజలకు వివరించేందు కోసం సదస్సును ఏర్పాటు చేస్తోన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ తరహా సదస్సులను విశాఖపట్నం, విజయవాడల్లో నిర్వహించిన పార్టీ అధిష్టానం తిరుపతి కేంద్రంగా జరిగే సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలను సమీకరించాలని చూస్తోంది.
సోమవారం తిరుపతిలో సమావేశమైన జిల్లా పార్టీ నాయకులు చంద్రారెడ్డి, పొన్నలూరి భాస్కర్, భానుప్రకాశ్‌రెడ్డి, శాంతారెడ్డి తదితరులు సదస్సు నిర్వహణకు సంబంధించి సమీక్షించారు. తిరుపతి సదస్సును భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన సూచన మేరకు పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ నాయకులకు ఆహ్వానాలు పంపాలని జిల్లా కమిటీ నిర్ణయించింది. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల నేతలతో మాట్లాడి ఏఏ స్థాయి నాయకులకు ఆహ్వానాలు పంపాలన్నవిషయంపై నాయకులు చర్చించారు. ముఖ్య అతిథులుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కమిటీ అ««ధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చారు. సదస్సు రోజున పార్టీ ముఖ్య నేతలకు ఆహ్వానం పలుకుతూ రేణిగుంట విమానాశ్రయం నుంచి సదస్సు జరిగే ప్రాంగణం వరకూ 2 వేల టూ వీలర్స్‌తో భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.