మెగా ఫ్యాన్స్‌తో తలనొప్పి?
- సర్దార్ గబ్బర్ సింగ్ టిక్కెట్లపై నెట్ సెంటర్ల కన్ను
- నకిలీ ప్రూఫ్‌లతో బుకింగ్
- బ్లాక్‌లో అమ్మేందుకు ప్రయత్నాలు
- ఆందోళన చెందుతున్న అభిమానులు
పాత శ్రీకాకుళం: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం టిక్కెట్లు కోసం ఇప్పటినుంచే అభిమానులు, ఫ్యాన్స్ తంటాలు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో 8వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంకు సంబంధించి టిక్కెట్లన్నీ ప్రధాన నెట్‌సెంటర్ల నిర్వాహకులు నకిలీ ఐటీ ప్రూఫ్‌లను జతచేస్తూ ముందుగానే ఆన్‌లైన్‌లో బ్లాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ టిక్కెట్లను అధిక రేట్లుకు బ్లాక్‌లో విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.
కొంతమంది అభిమానులతో బేరసారాలు కూడా ముమ్మరం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం శ్రీకాకుళం నగరంలో రామకృష్ణా, సరస్వతి, కిన్నెర థియేటర్లకు రానుంది. మరో 3 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని వేసేందుకు ఆయా యాజమాన్యాలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదిలావుండగా అభిమానుల ఒత్తిడి మేరకు ఈ చిత్రాన్ని ఆ రోజు ఉదయం 7 గంటల షో వేసేందుకు జిల్లా యంత్రాంగానికి ప్రధాన థియేటర్ యాజమాన్యం ఓ లేఖను రాసినట్టు సమాచారం.
మెగా ఫ్యాన్స్‌తో థియేటర్ల యాజమాన్యాలకు తప్పని తలనొప్పి?
మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా విడుదలైనా థియేటర్ల యాజమాన్యాలకు తలనొప్పి తప్పడం లేదు. పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధర్మతేజ్, వరుణ్‌తేజ్ అందరి హీరోలకు ఫ్యాన్స్ అంటూ ఇప్పటికే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు ఇదివరకే ఒక లెటర్ ప్యాడ్‌ను తయారు చేసుకొన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో సినిమా వచ్చినా థియేటర్ల వద్దకు వీరు వచ్చి మా హీరో సినిమాకు ఇన్ని టిక్కెట్లు కావాలంటూ యాజమాన్యాలకు లెటర్‌ను సమర్పిస్తూ హుకుం జారీ చేస్తారు. సినిమా పడిన అన్ని థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంటుంది. అటు నెట్ సెంటర్లు, ఇటు ఫ్యాన్స్‌తో సాధారణ ప్రేక్షకులంతా సినిమా చూడలేక బ్లాక్‌ల్లోనే టిక్కెట్లు కొనుక్కోవల్సిన దుస్థితి దాపురించింది. థియేటర్ల వద్ద తక్కువగా టిక్కట్లు ఇస్తూ యాజమాన్యాలు కూడా ముఖం చాటేస్తున్నాయి.
తప్పుడు ఐడీ ఫ్రూఫ్‌లతోనే...
జెస్ట్ టిక్కెట్స్, బుక్ ఫిలిమ్, బుక్‌మైషో ద్వారా ఆన్‌లైన్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్ టిక్కెట్లును నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఒక ఐడీ పాస్‌వర్ట్‌తోనే బుక్ చేసుకోవల్సి ఉంది. సినిమా విడుదలకు ముందురోజే థియేటర్ల యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో కొన్ని రకాల క్లాస్ టిక్కెట్లు పెడతారు. ఆయా థియేటర్లు ఆన్‌లైన్‌లో పెట్టే టిక్కెట్లను పూర్తిగా తప్పుడు ఐడీ ప్రూఫ్‌లతో నెట్‌సెంటర్ల నిర్వాహకులు బ్లాక్ చేస్తూ అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనంతటికీ ఒక క్రియేటివ్ ఐడీ పాస్‌వర్డ్‌ని ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం. ఈ వ్యవ హారమంతా ప్రధాన నెట్ సెంటర్ల నిర్వాహకుల కనుసన్నల్లోనే సాగుతున్నట్టు భోగట్టా. దీనిపై జిల్లా యంత్రాంగం, థియేటర్ల యాజమాన్యాలు వెంటనే స్పందించి సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఆన్‌లైన్ టిక్కెట్లతో జాగ్రత్త తప్పనిసరి
ఇటీవల ఆన్‌లైన్ నెట్ సెంటర్ల నిర్వాహకులు తప్పుడు ఐడీ ప్రూఫ్‌లతో టిక్కెట్లు బ్లాక్ చేసి చాలా మంది అమాయకులకు కట్టబెడుతున్నారు. వారు ఎటువంటి ఐడీ ప్రూఫ్‌లు తేకుండా నేరుగా సినిమాకు వచ్చేసి థియేటర్‌లో తిప్పలు పడుతూ వెనుదిరిగి పోతున్నారు.
- బోసుబాబు, ఎస్‌వీసీ థియేటర్ మేనేజర్, శ్రీకాకుళం
అభిమానులకు టిక్కెట్లు ఇవ్వాలి
మెగా హీరోలకు సంబంధించి ఏ హీరో సినిమా వచ్చినా ఆ హీరో ఫ్యాన్స్‌కు ముందు అవకాశం ఇవ్వాలి. తర్వాత మిగతావారికి ఇచ్చే విధంగా థియేటర్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. ఆన్‌లైన్‌లో అందరికీ టిక్కెట్లు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.
- రాము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, శ్రీకాకుళం
ఫ్యాన్స్‌కు కేటాయించాలి
మెగాఫ్యాన్స్‌తో మాకు ఎప్పుడూ తిప్పలు తప్పడం లేదు. అభిమానులకంటూ ప్రత్యేకించి ఒకటో, రెండో థియేటర్లు కేటాయిస్తే బాగుంటుంది. మెగా ఫ్యామిలీ హీరో అభిమానులంతా మాపై ఒత్తిడి తెస్తూ టిక్కెట్లు కోసం నిలువదోపిడీ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు ఇవ్వలేక పోతున్నాం.
- చినరాజు,
సరస్వతి థియేటర్ మేనేజర్, శ్రీకాకుళం