
చూపు లేకున్నా సివిల్స్‌లో సత్తా చాటాడు..
‘తూర్పు’ యువకుడు సింహాచ లానికి 538వ ర్యాంకు
మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన కట్టా సింహాచలం సివిల్స్‌లో సత్తా చాటారు. ఈయన పుట్టుకతోనే అంధుడు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 538వ ర్యాంకు సాధించారు. సింహాచలం నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి పాత గోనెసంచుల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించేవారు. మూడేళ్ల క్రితం తండ్రి చనిపోయినా సింహాచలం మొక్కవోని దీక్షతో విద్యా ప్రస్థానం కొనసాగించారు.
గతేడాది సివిల్స్ పరీక్షల్లో 1,212వ ర్యాంకు సాధించిన సింహాచలం ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. అయితే ఐఏఎస్ కావాలన్న దృఢ సంకల్పంతో మళ్లీ పరీక్ష రాసి 538వ ర్యాంకు సాధించారు. బుధవారం ఆయన ఫోన్‌లో ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రస్తుతం సాధించిన ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపిక కాగలనన్న ధీమా వ్యక్తం చేశారు.