సముద్రంలో బోటుబోల్తా
-
నడిసంద్రంలో ప్రమాదం
-
ప్రాణాలతో బయటపడిన ఐదుగురు మత్స్యకారులు
-
ధ్వంసమైన బోటు
-
కొట్టుకుపోయిన వలలు
-
రూ.2 లక్షల మేర నష్టం
కావలిరూరల్: సముద్రంలో చేపల వేట సాగించేందుకు వెళ్లిన బోటు బోల్తాపడింది. నడిసంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందులోని ఐదుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని తుమ్మలపెంట పంచాయతీ చిన్నరాముడుపాళెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని చిన్నరాముడుపాళెంకుS చెందిన కోడూరు శ్రీనివాసులు, కోడూరు బాబు, కోడూరు వెంకటరమణ, మామిళ్ల శ్రీనివాసులు, కోడూరు ప్రసాద్ ఫైబర్ బోటులో చేపల వేటకోసం సముద్రంలోకి వెళ్లారు. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అలల తాకిడికి సముద్రంలో బోటు బోల్తా పడింది. దీంతో బోటు ధ్వంసం కాగా, వలలు అలలకు కొట్టుకుని పోయాయి. బోటులో ఉన్న ఐదుగురు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
సహాయం కోసం కలెక్టరుకు విజ్ఞప్తి
బోటు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన మత్యకారులు శుక్రవారం కలెక్టరు ముత్యాలరాజును కలిసి ప్రమాద వివరాలను తెలియజేశారు. తాము నిరుపేదలమని, వేటే తమ జీవనాధారమని తలా కొంత అప్పులు చేసి బోటును ఏర్పాటు చేసుకొని వేటకు వెళ్లి జీవిస్తున్నామన్నారు. రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తరపున సహాయం చేసి తమను ఆదుకోవాలి కలెక్టరుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మత్యశాఖ జేడీ, ఏడీ, ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం కోరారు.
ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శ :
బోటు ప్రమాదం జరిగిందని తెలియగానే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బాధిత మత్యకారులను ఫోన్‌లో పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సురక్షితంగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.