మదనపల్లెలో పేలుడు
♦ ఇంటిగోడ కూలి వృద్ధుడి మృతి
♦ బాంబు పేలుడువల్ల కూలిపోయిందంటున్న స్థానికులు
♦ సెల్ ఫోన్ పేలడంవల్లేనంటున్న పోలీసులు
మదనపల్లె క్రైం: ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఒక ఇంట్లో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించి ఇంటి గోడ రెండువైపులా కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. భారీగా పొగ వచ్చి మంటలు వ్యాపించడంతో స్థానికులు భయకంపితులయ్యారు. గౌనిమాకులపల్లె సుబ్రమణ్యం (60) మదనపల్లె పట్టణంలోని చీకులగుట్ట గౌతమినగర్‌లో 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అతనికి భార్య చిన్నమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారులు అందరికీ పెళ్లిళ్లు కావడం తో పక్కపక్క ఇళ్లలోనే వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నకుమారుడు మంజుబాబు నాలుగేళ్ల క్రితం మృతిచెందడంతో కోడలు అన్నపూర్ణ తన ఇం టిలో ఒక్కావిడే ఉంటోంది.
సుబ్రమణ్యం, అతని భార్య చిన్నమ్మ గొర్రెలు మేపుకుంటున్నారు. సుబ్రమణ్యం ఆదివారం మధ్యాహ్నం ఇంటి పక్క ఉన్న గొర్రెల మందలో చెత్త ఊడ్చేందుకు వెళ్లా డు. ఆ సమయంలో అన్నపూర్ణ ఉంటున్న ఇంటి లో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి ఇంటి రెండువైపుల గోడలు కూలిపోయి ఆ సమయంలో ఆ పక్క నుంచి వెళుతున్న సుబ్రమణ్యంపై పడ్డాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
భారీగా పొగవచ్చి, మంటలు వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, 108 సిబ్బంది, టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గోడల కింద ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు మాంత్రికుడు కావడంతో గిట్టని వారు బాంబు వేయడం వల్ల చనిపోయి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సెల్‌ఫోన్ పేలడం వల్లే ఈ సంఘటన జరిగిందని టూటౌన్ సీఐ హనుమంతునాయక్ తెలిపారు. అయితే సిమెంట్ స్లాబ్‌తో పది అడుగుల మందం గోడ ఉన్న ఇల్లు సెల్‌ఫోన్ పేలడంతో కూలిపోయిందని చెప్పడం నమ్మశక్యంగా లేదని స్థానికులు అంటున్నారు.