పుష్కరాల్లో పనికి వచ్చి..
పుష్కరాల్లో పనికి వచ్చి..
Published Wed, Aug 24 2016 9:29 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
* నీటమునిగి ఇద్దరు మృతి
* స్వీట్‌షాపులో పనిచేసేందుకు వచ్చిన గుడివాడ యువకులు
* కూలి డబ్బు తీసుకొని తిరుగు పయనం
* స్నానం కోసం నదిలో దిగి మృత్యువాత
అమరావతి : కృష్ణా పుష్కరాల సందర్భంగా స్వీట్‌షాపులో పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించుకుందామని జిల్లా దాటి వచ్చిన ఆ యువకులకు ఇవే చివరి పుష్కరాలయ్యాయి. దాదాపు రెండు వారాల తర్వాత తమ ఇంటికి వెళ్లేందుకు ఉత్సాహంగా బయల్దేరిన వీరిని మృత్యువు కబళించింది. మండల పరిధిలోని ధరణికోట గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాజిల్లా గుడివాడ చెందిన గరిక వెంకట మహేష్ (24), తోట దుర్గారావు (22) పుష్కరాల సందర్భంగా అమరావతిలో ఓ స్వీట్‌షాపులో పనిచేసేందుకు వచ్చారు. మంగళవారంతో పుష్కరాలు పూర్తవడంతో బుధవారం తమ కూలి డబ్బు తీసుకుని స్నానం చేసి వెళదామని ధరణికోటలోని అల్లుళ్లపేట సమీపంలో కృష్ణానది తీరానికి చేరుకుని స్నానానికి దిగారు. ఈ నేపథ్యంలో వీరు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో రెండు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించి వారి సమక్షంలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారికి అప్పగించారు. చేతికందివచ్చిన పిల్లలు చనిపోవటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Advertisement